మోడీ పాలనలో భారత్ దూసుకుపోతోందంటూ బీజేపీ నేతలు గొప్పలు చెబుతోన్న సంగతిత తెలిసిందే. కానీ, తాజాగా మోడీకి షాకిచ్చే సర్వే ఒకటి చర్చనీయాంశమైంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టు జాబితాలో భారత్ ర్యాంకింగ్ రెండు స్థానాలకు పడిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న ర్యాంకింగ్ తో పోలిస్తే తాజాగా భారత్ ర్యాంకింగ్ తగ్గింది. ఇక.. ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ పాస్ పోర్టుగా జపాన్ నిలిచింది. ఇంతకాలం ఆ స్థానంలో సింగపూర్.. సౌత్ కొరియాలు ఉండగా.. వాటిని తోసి మరీ తాను ముందుకు వచ్చింది.
జపాన్ పాస్ పోర్టు ఉన్న వారు ఎవరైనా సరే.. ఎలాంటి వీసా అవసరం లేకుండా 193 దేశాలకు వెళ్లే వెసులుబాటు ఉంటుంది. అదే మన దేశం విషయానికి వస్తే.. మన పాస్ పోర్టు ఈ ఏడాది మొదట్లో 83వ స్థానంలో ఉండగా.. తాజాగా 85 స్థానానికి దిగజారింది. ఇండియన్ పాస్ పోర్టుతో ఎలాంటి వీసాలు లేకుండా 57 దేశాలకు వెళ్లే వీలుంది. అదే.. 2021లో అయితే భారత్ పాస్ పోర్టుతో వీసా లేకుండా 58 దేశాలకు వెళ్లే అవకాశం ఉండేది.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టుల విషయానికి వస్తే.. జపాన్ తర్వాత సింగపూర్.. దక్షిణ కొరియాలకు చెందిన పాస్ పోర్టులు ఉంటే ఎలాంటి వీసా అవసరం లేకుండా 192 దేశాలకు వెళ్లి రావొచ్చు. ఇక.. పాస్ పోర్టుల విషయంలో అత్యంత దారుణమైన.. దయనీయమైన స్థానాల్లో ఉన్న దేశాల్లో చివరి స్థానంలో అఫ్ఘనిస్థాన్ ఉంటే.. దాయాది పాకిస్తాన్ 109వ స్థానంలో నిలిచింది. పాక్ పాస్ పోర్టుతో కేవలం 32 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉంది.