జగన్ సర్కార్ లోని పలువురు ఐఏఎస్ లు, అధికారుల తీరుపై హైకోర్టు గతంలో చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని హైకోర్టు గతంలోనే పలుమార్లు హెచ్చరించింది. అయితే, కోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా ఇటు ప్రభుత్వం, అటు అధికారులు తీరులో మార్పు రాకపోవడంతో గతంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు వారం రోజుల పాటు జైలు శిక్ష కూడా విధించింది.
హైకోర్టు తీర్పును అమలు చేయలేదని ఇద్దరు ఐఏఎస్ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్ లకు హైకోర్టు గతంలో వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం సంచలనం రేపింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆ ఇద్దరు ఐఏఎస్ లు అమలు చేయకపోవడంతో వారికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది. అయినప్పటికీ, ఏపీలో మరికొందరు ఐఏఎస్ ల తీరు మారకపోవడంతో తాజాగా మరోసారి హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ భూమికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించడంలో కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టడంతో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం చేయడమే కాకుండా, చెల్లించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలనూ లెక్కచేయకపోవడంతో ఆ ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష, జరిమానా విధించడం సంచలనం రేపింది. వారికి విధించిన జైలుశిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు వారికి నెల రోజుల పాటు శిక్షను సస్పెండ్ చేసింది.
నెల్లూరుకు చెందిన తాళ్లపాక సాయి బ్రహ్మ అనే మహిళ భూమి తీసుకొని నష్టపరిహారం చెల్లించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఆ తర్వాత ఆమెకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కానీ, కోర్టు ఆదేశించిన తర్వాత కూడా చెల్లింపులో జాప్యం జరగడంతో, ఆ నష్టపరిహారం చెల్లింపులో జాప్యానికి కారణమైన మాజీ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్‌కు నెల రోజుల జైలు శిక్షతోపాటు రూ.లక్ష జరిమానాను హైకోర్టు విధించింది. ఆయనతోపాటు అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిరావుకు 2 వారాల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించింది.
ఐఏఎస్ అధికారి రావత్‌కు నెల రోజుల జైలు శిక్ష, రూ.1000 జరిమానా, ముత్యాల రాజుకు 2 వారాల జైలు శిక్ష, రూ. 1000 జరిమానా, ఏఎంబీ ఇంతియాజ్‌కు 2 వారాల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అంతేకాదు, ఆ ఐఏఎస్ అధికారుల జీతాలలో కట్ చేసిన సొమ్ముతో సదరు మహిళకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేయడం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మరి, హైకోర్టు తాజా తీర్పుతోనైనా కోర్టు ఆదేశాలను అధికారులు, ఐఏఎస్ లు బేఖాతరు చేయకుండా ఉంటారా లేదా అన్నది వేచి చూడాలి.