ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా.. రాష్ట్ర, దేశ, అంతర్జాతీయంగా కూడా టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, అన్నగారి మనవడు.. నారా లోకేష్.. ఒక ట్వీట్ చేశారు.
40 వసంతాల పసుపు పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నారా లోకేష్ పేర్కొన్నారు. పేద ప్రజలకు ఎన్టీఆర్ దేవుడు అయితే.. రాముడైన చంద్రబాబు మన ధైర్యం అంటూ ట్వీట్ చేశారు. కార్యకర్తలే మనకు బలం అన్నారు. పసుపు జెండా మన పవర్ అంటూ.. ఎత్తర జెండా అనే రేంజ్ లో ట్వీట్ చేశారు.
“40 వసంతాల పసుపు పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. దేవుడు ఎన్టీఆర్ గారు, రాముడు చంద్రబాబు గారు మన ధైర్యం, కార్యకర్తలు మన బలం, పసుపు జెండా మన పవర్. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది మా తాత, అభివృద్ధి ని పరిచయం చేసింది మా నాన్న. అధికారం ఉన్నా లేకపోయినా ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేద్దాం“ అని లోకేష్ వరుస ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో లోకేష్ చెబుతున్న విషయంపై టీడీపీ శ్రేణల్లో చర్చ జరుగుతోంది.
నిజమే కదా.. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో 1982లో పార్టీని ఆవిర్భవింపజేసిన.. అన్నగారు..అణగారిన వర్గాలను.. పేదలను అక్కున చేర్చుకున్న తీరును వారు ప్రస్తావిస్తున్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం అందించడం దగ్గర నుంచి .. బీసీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో వారికి కూడా రాజ్యాధికారం దక్కాలనే కాంక్షతో ఆయా వర్గాల్లో కూడా నేతలను తయారు చేసిన ఎన్టీఆర్.. నిజంగానే దేవుడుగా.. తెలుగు దేశం పార్టీ అభిమానులే కాకుండా. ఆయా వర్గాలు కూడా పేర్కొంటా యి. మహిళా సాధికారతకు ఎన్టీఆర్ హయాంలోనే పునాదులు పడ్డాయి. అప్పట్లోనే మహిళలకు తమ తండ్రి ఆస్తిలో హక్కును కల్పించారు. అదేసమయంలో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అన్నగారు ఎంతో కృషి చేశారు.
అదేవిధంగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. నేనున్నానంటూ కదిలిన నాయకుడు కూడా ఎన్టీఆర్. తనకు ఏ సమస్య వచ్చినా.. ప్రజల మధ్యకు వచ్చారు. ప్రజల సమస్యలు ఉన్నప్పుడు.. కూడా ప్రజల మధ్యే ఉండి.. వారికోసం వారి సంక్షేమం కోసం.. అనేక రూపాల్లో కృషిచేశారు. కాబట్టి.. అన్నగారిని ఇప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో దేవుడుగానే కొలుచుకుంటున్నారు.
ఇక, చంద్రబాబు విషయానికి వస్తే.. ఈ తరహా.. డిఫరెంట్. రాష్ట్రాన్ని జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో చంద్రబాబు కృషి అమోహం అంటున్నారు తమ్ముళ్లు. ఎందుకంటే.. వచ్చే 50 సంవత్సరాలను దృస్టిలో పెట్టుకుని.. ఒక విజన్ ఏర్పాటు చేసుకుని చంద్రబాబు నడిచిన తీరు.. రాష్ట్రానికి దశ, దిశ కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. అందుకే.. విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారు.
చంద్రబాబు హయాంలో జరిగిన హైదరాబాద్ అభివృధ్ధిని విస్మరించే సాహసం ఎవరూ చేయలేరు. ఆయనను రాజకీయంగా విభేదించే నాయకులు కూడా హైదరాబాద్ ఫలాల విషయంలో మాత్రం చంద్రబాబుకు వంక పెట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా సైబరాబాద్ నిర్మాణం కూడా చంద్రబాబు కీర్తి కిరీటంలో కలికి తురాయిగా నిలిచిపోయింది.
నవ్యాంధ్రలో అమరావతి నిర్మాణాన్ని 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని చేశారు. అయితే.. ఇది వివాదంలో ఉంది. ఇక, మహిళా సాధికారతకు , వారి ఆర్థిక పరిపుష్టికి.. చంద్రబాబు డ్వాక్రా సంఘాలను తీసుకువచ్చారు. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించారు. ఇలా.. మొత్తంగా.. అన్నగారు ఎన్టీఆర్ దేవుడు అయితే..చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడిగా చరిత్ర సృష్టించారనడంలో సందేహం లేదు.