జెండా బహిరంగ సభలో సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బలి చక్రవర్తిని వామనుడు కూడా మూడడుగుల భూమి అడిగాడని, కానీ ఆ భూమి అడిగిన తర్వాత బలి చక్రవర్తి నెత్తిపై వామనుడు కాలుపెట్టి పాతాళానికి తొక్కేశాడని గుర్తు చేశారు. అదేవిధంగా జగన్ ను పాతాళానికి తొక్కేయకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా మంచితనం, సహనం ఉన్న పవన్ కళ్యాణ్ ను మాత్రమే చూశారని, ఇకపై ఇంకో పవన్ కళ్యాణ్ ను చూపిస్తానని హెచ్చరించారు.
సిద్ధం అంటున్న జగన్ పై యుద్ధం చేద్దామని టీడీపీ-జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేనకు 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై జనసైనికుల్లో అసంతృప్తి ఉందని, కానీ, గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలేనని గుర్తు చేశారు. సీట్ల వ్యూహాన్ని తనకు వదిలేయాలని, తనపై నమ్మకం ఉంచాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. అంకెలు లెక్కపెట్టొద్దని, ఇటుక ఇటుక పేర్చి ఈరోజు ఇల్లు కడుతున్న తాను రేపు కోట కూడా కడతానని చెప్పుకొచ్చారు. ఐదుగురు రెడ్లు 5 కోట్ల మంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, అన్ని జిల్లాల్లో పెత్తనం సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
ఇక, టీడీపీ-జనసేన నేతలను, కార్యకర్తలను వైసీపీ గూండాలు ఇబ్బంది పెడితే మక్కెలిరగ్గొడతానని పవన్ హెచ్చరించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వంటి ఉద్ధండుడైన నేతను జైల్లో పెడితే బాధేసిందని, ఆ బాధతోనే ఆయనను కలిసి కూటమి ఏర్పాటు చేసి టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని ప్రతిపాదించానని క్లారిటీనిచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు వంటి అనుభవం ఉన్న నేత అవసరం ఎంతైనా ఉందని పవన్ అన్నారు. తన నిర్ణయాలు పార్టీపరంగానో, వ్యక్తిగతంగానో, వ్యక్తులపరంగానో ఉండవని, రాష్ట్రాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసమే ఉంటాయని పవన్ చెప్పారు. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలని, అలా వెళ్ళినప్పుడే రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు బాగుంటుందని అభిప్రాయపడ్డారు.