టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజకీయ వ్యూహకర్త పీకే సమావేశం ఏపీ రాజకీయాలలో కీలక పరిణామంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబును కలిసిన తర్వాత పీకే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సీనియర్ పొలిటిషియన్ అయిన చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశానని పీకే వెల్లడించారు. తనను కలవాలని చంద్రబాబు కోరారని, అందుకే ఆయనతో భేటీ అయ్యానని చెప్పారు.
చంద్రబాబుతో పీకే భేటీ నేపథ్యంలో ఐ ప్యాక్ అధికారికంగా కీలక కామెంట్లు చేసింది. గత ఏడాది కాలంగా వైసీపీతోనే ఉన్నామని, 2024 ఎన్నికల్లో జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని వెల్లడించింది. రాబోయే ఎన్నికల కోసం వైసీపీతో కలిసి అంకితభావంతో నిర్విరామంగా పని చేస్తున్నామని ఐ ప్యాక్ టీం చెప్పింది. దీంతో, ఐప్యాక్ కు పీకేతో సంబంధాలు తెగిపోయాయని క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది.
ఇక, చంద్రబాబు అరెస్టును ఐప్యాక్ టీం వ్యతిరేకించినా జగన్ ముందుకు వెళ్లారని టాక్ వస్తోంది. మీడియాలో చంద్రబాబు అరెస్టు గురించి వచ్చేదాకా తమకు తెలియకపోవడంతో ఐ ప్యాక్ సభ్యులు షాకయ్యారట. దీంతో, జగన్ పై ఐ ప్యాక్ టీం గుర్రుగా ఉందని, కానీ, ముందస్తు ఒప్పందం ప్రకారం ఇంకొన్ని నెలలు వైసీపీ కోసం పనిచేయక తప్పదన్న భావన ఐ ప్యాక్ టీంలో కనిపిస్తోందని తెలుస్తోంది. దీంతో, వైసీపీ కోసం ఐ ప్యాక్ పనిచేస్తుండగా…చంద్రబాబు కోసం పీకే పని చేసే అవకాశముదంని తెలుస్తోంది. అంటే, ఐ ప్యాక్ తో పీకేకు సంబంధం లేదు. జగన్ తో ఐ ప్యాక్..చంద్రబాబుతో పీకే అన్నమాట. కానీ, టీడీపీతో పనిచేయబోతున్నానని పీకే అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.