నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు టీడీపీ తరఫున ఉండి ఎమ్మెల్యే టికెట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారని కొన్ని మీడియా ఛానెళ్లలో వార్తలు ప్రసారమైన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై రఘురామ స్పందించారు. ‘‘ఉండి టికెట్ నీకే అని చంద్రబాబు నాకు చెప్పలేదు, అదే సమయంలో ఉండి టికెట్ నీకు ఇవ్వడం లేదు అని సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామ రాజుకు కూడా చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు అదే వాస్తవం’’ అని రఘురామ క్లారిటీనిచ్చారు.
తాను బేషరతుగా టీడీపీలో చేరానని, కానీ, కచ్చితంగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని అనుకుంటున్నానని చెప్పారు. ఎంపీగానా, ఎమ్మెల్యేగానా అనేది చంద్రబాబు నిర్ణయిస్తారని అన్నారు. నరసాపురం పార్లమెంటు ఇన్చార్జి బాధ్యతలు తనకు ఇవ్వలేదని, జూన్ 4 వరకు తాను అక్కడ సిట్టింగ్ ఎంపీని అని అన్నారు. పార్టీ నిర్ణయం ఫైనల్ అని, ఫలానా స్థానం నుంచి పోటీ చేస్తానని చంద్రబాబును తాను అడగలేదని అన్నారు. అయితే, విజయనగరం నుంచి పోటీ చేయాలని తనకు ఆహ్వానం అందిందని చెప్పారు.