మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ నేడు జరగనున్న సంగతి తెలిసిందే. మచిలీపట్నం శివార్లలో దాదాపు 35 ఎకరాల్లో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఆ సభా వేదికకు శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు. ఈ క్రమంలోనే విజయవాడ ఆటోనగర్ నుంచి వారాహి వాహనంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మచిలీపట్నం బయల్దేరారు.
పవన్ వారాహి వెంట వందలాది వాహనాలు, వేలాది మంది జనసైనికులు, పవన్ అభిమానులు బారులు తీరడంతో వారాహి వాహనం చాలా నెమ్మదిగా ముందుకు సాగుతోంది. వారాహి వెంట భారీగా జనసేన శ్రేణులు తరలిరావడంతో విజయవాడ-బందరు రోడ్డు జనసంద్రంగా మారింది.
ఒక దశలో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పవన్ ర్యాలీలో ఇసుకేస్తే రాలనంత మంది జనసేన శ్రేణులు, ప్రజలు వెంట తరలిరాగా వారాహి యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. జనాన్ని అదుపుచేసేందుకు, ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
వారాహి రాకతో విజయవాడ-మచిలీ పట్నం హైవేపై ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయ్యింది. దీంతో వారాహి ముందు 2 పోలీస్ వాహనాలతో పవన్ ర్యాలీ నీ వేగంగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం పవన్ ర్యాలీ ఈడుపుగల్లు చేరుకుంది. వేలాది కొద్ది బైకులతో పవన్ వాహనాన్ని అనుసరిస్తున్నారు. మార్గమధ్యంలో పెనమలూరు నియోజకవర్గం, ఈడ్పుగల్లు వద్ద అంబులెన్స్ కు దారివ్వడం కోసం 10 నిమిషాలపాటు తన వారాహిని పవన్ నిలిపివేశారు.
అంబులెన్స్ ముందుకు వెళ్లిపోయిన తర్వాత వారాహి యాత్ర కొనసాగింది. వాస్తవానికి సాయంత్రం 5 గంటలకు పవన్ సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంది. కానీ, భారీ జనసమూహం, వాహన శ్రేణుల నడుమ వారాహి నిదానంగా కదులుతున్న తీరు ప్రకారం పవన్ రాత్రి 9-10 మధ్యలో సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశముందని తెలుస్తోంది.