జనవాణి కార్యక్రమంలో అవినీతి, ఇళ్ల పట్టాలు, మౌలిక వసతుల గురించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందని ప్రజలంటున్నారన్నారు.
మేలు చేస్తాడని అధికారం అప్పగిస్తే.. అది భ్రమేనని తేలిపోయిందన్నారు. ప్రభుత్వం అరాచకం మొదలైన రోజు నుంచే జనసేన పోరాటం ప్రారంభమైందని పవన్‌కల్యాణ్ అన్నారు. అసలు జగన్‌ను జనం ఎలా నమ్మారో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు.
ఆ పనిచేయడం చేతకాదా?
ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే.. కలెక్టర్ నుంచి ఆర్డీవో వరకు అందరినీ రంగంలోకి దించుతారు. కానీ, ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు వ్యవస్థలు ఎందుకు పని చేయవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన మూడో విడత జనసేన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. వైసీపీ సర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
‘‘151 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలా అద్భుతాలు చేసి ఉండొచ్చు. రాష్ట్రంలో అనేక సమస్యలుంటే ఒక సినిమా రిలీజ్‌కు .. చీఫ్ సెక్రటరీ నుంచి కలెక్టర్లు, ఆర్డీవోల వరకు మొత్తం యంత్రాంగాన్ని తిప్పగలరు. కానీ ఇళ్ల పట్టాలు, టిడ్కో హౌసింగ్ సమస్యలు, మౌలిక వసతుల కల్పనకు వ్యవస్థలు ఎందుకు పనిచేయవు. ఎందుకంటే.. వీటిపై వారికి శ్రద్ధ ఉండదు. ప్రత్యర్థులపై దాడి చేయాలంటే కలెక్టర్, చీఫ్ సెక్రటరీ అందరూ ముందుకొస్తారు. 5, 10, 15 రూపాయల సినిమాల కోసం వ్యవస్థను మొత్తం నడపగలరు కానీ, సగటు మనిషి సమస్యల పరిష్కారానికి ఎందుకు బయటకు రారు.“ అని ప్రశ్నించారు.
నిషేధం ఎక్కడా?
“దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఉన్నా పింఛను ఇవ్వట్లేదు. తూతూ మంత్రంగా కొంతమందికి ఇచ్చి వదిలేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారు. మేం కూడా ఇక్కడ పెరిగిన వాళ్లేమే. మేమేదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచో, న్యూయార్క్.. బాస్టన్ లాంటిచోట పెరగలేదు. ఆంధ్రాలోనే పెరిగాం. అన్నొస్తే అద్భుతాలు జరగుతాయన్నారు. కానీ, ఎక్కడా జరగడంలేదు. మద్యపానం నిషేధం అన్నారు ఏదీ? ఎక్కడ?“ అని ఎద్దేవా చేశారు.
మాటల మామయ్య!
“యువత మధ్య వ్యక్తిగతంగా అనేక భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. కానీ, ప్రజా సమస్యలపై అందరూ ఏకమై పోరాడాలి. ఇన్నేళ్లుగా భీమవరం డంపింగ్‌యార్డు సమస్య ఎందుకు పట్టించుకోరు. చేయాలని చిత్తశుద్ధిలేదు వీళ్లకు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చాలా పనులు చేయొచ్చు. తుందూరు ఆక్వా ఫ్యాక్టరీ గురించి ముద్దుల మావయ్య బాగా చెప్పారు. అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పారు. మావయ్యకు జేబులో నుంచి డబ్బులు తీయడం రాదు కానీ, నోట్లో నుంచి మాటలు మాత్రం బాగా వస్తాయి’’ అని పవన్ కల్యాణ్ విమర్శించారు.
Comments 1