తప్పు చేసే వాళ్లను వదలిపెట్టేదే లేదని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తప్పు చేయాలనే భావన కలిగినా వణికిపోయే పరిస్థితి రావాలని హోం మినిస్టర్ వంగలపూడి అనిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, నేరస్థులను వదిలిపెట్టమని ఆమె హెచ్చరించారు. అలాగే పోలీస్ వ్యవస్థపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. కిందిస్థాయి నుంచి పోలీస్ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామన్నారు. కొందరు పోలీసు అధికారులు పద్ధతి మార్చుకోవాలని హోం మంత్రి వార్నింగ్ కూడా ఇచ్చారు.
గత ప్రభుత్వంలో సీఎం జగన్ అండ చూసుకుని కొంతమంది పోలీసు అధికారులు రెచ్చిపోయారనే ఆరోపణలున్నాయి. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలే టార్గెట్‌గా ఈ పోలీసులు పని చేశారనే విమర్శలు వచ్చాయి. టీడీపీ నేతలు, శ్రేణులపై అక్రమ కేసులు బనాయించారనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలోనే హోం మంత్రి అనిత పోలీస్ శాఖను హెచ్చరించడం హాట్ టాపిక్‌గా మారింది. పోలీసు అధికారులు పద్ధతి మార్చుకోవాలని లేదంటే తామే మారుస్తామని ఆమె క్లారిటీతో చెప్పారు.
అంతే కాకుండా గతంలో తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను సమీక్షిస్తామని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. గతంలో తనపై కూడా పోలీసులు అట్రాసిటీ కేసులు పెట్టారన్నారు. చట్టప్రకారం పోలీసులు నడుచుకోవాలని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో అశాంతి లేకుండా చూస్తామన్నారు. అన్యాయాలపై ఉక్కుపాదం మోపుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే అనిత ఇలా వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. కక్ష్యసాధింపు కోసం జగన్ పోలీసులను వాడుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో అనిత వార్నింగ్ ఎవరికి తగలాలో వాళ్లకు గట్టిగానే తగిలిందనే టాక్ వినిపిస్తోంది.