పాకిస్థాన్ వంటి మతతత్వ దేశంలో హిందువులు మైనారిటీలుగా ఎన్నో ఆంక్షలు మరెన్నో అడ్డంకులు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. దీంతోపాటు, ఉగ్రవాదుల కదలికలు…నిత్యం బాంబు పేలుళ్లతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని అక్కడి హిందువులు భయపడుతుంటారు. ఇక, మహిళలపై అయితే, దాయాది దేశంలో విపరీతమైన ఆంక్షలుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ లో ఓ హిందూ యువతి సత్తా చాటింది.
పాకిస్థాన్ లోని సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ (సీఎస్ఎస్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పాకిస్థాన్ ఎడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (పాస్)కు ఎంపికైంది. తద్వారా పాకిస్థాన్‌లో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా రికార్డు సృష్టించింది. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని షికార్పూర్ జిల్లాకు చెందిన సనా రామ్‌చంద్ సీఎస్ఎస్ పరీక్షలో ఉత్తీర్ణులైన 221 మందిలో ఒకరిగా నిలిచింది.
త్వరలోనే సనా అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనుంది. ఇప్పటికే ఎంబీబీఎస్ చేసిన సనా వైద్యవృత్తిలో రాణిస్తోంది. పట్టుదలతో చదివి సీఎస్ఎస్ కు ఎంపికైన సనా రామ్ చంద్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.