టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణను అరెస్ట్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిిందే. అయితే, నారాయణ అరెస్టు వ్యవహారంపై పోలీసులు అధికారికంగా స్పందించకపోవడంతో అది నిజమా..పుకారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. నారాయణను అదుపులోకి తీసుకున్నారని కొందరు చెబుతున్నా…ఏ సెక్షన్ల కింద అదుపులోకి తీసుకున్నారన్నదానిపై క్లారిటీ లేదు.
ఈ క్రమంలోనే తాజాగా నారాయణ అరెస్టుపై చిత్తూరు పోలీసులు స్పందించారు. నారాయణను అరెస్ట్ చేసిన మాట వాస్తవమేనని ,హైదరాబాద్లో మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఆయనను అరెస్ట్ చేసి చిత్తూరు తరలించామని కూడా తెలిపారు. పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ చట్టం కింద, ఐపీసీ సెక్షన్లు 408,409, 201,120(బీ),తో పాటు 65 ఐటీ చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. పబ్లిక్ ఎగ్జామ్ చట్టంలోని సెక్షన్లు 5, 8, 10 కింద కూడా నారాయణపై కేసులు నమోదు చేశారు.
ఏపీ పోలీసులు ఆయనను హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం మీదుగా చిత్తూరు తరలిస్తున్న నేపథ్యంలో హైడ్రామా నడిచింది. నారాయణ విద్యా సంస్థలకు చెందిన సిబ్బందితో పాటు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో నిరసనలు తెలిపారు. కర్నూలులోని నారాయణ విద్యాసంస్థలకు చెందిన సిబ్బంది హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై కర్నూలు సమీపంలో ఉన్న పుల్లూరు టోల్గేటు వద్ద నిరసన తెలిపారు. వారికి మద్దతుగా టీడీపీ కార్యకర్తలు భారీగా రావడంతో పుల్లూరు టోల్ గేటు దగ్గర హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.
అంతకుముందు, నారాయణ కిడ్నాప్ కు గురయ్యారంటూ ఆయన వ్యక్తిగత సహాయకులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ జారీ చేశారు. షాద్ నగర్ కొత్తూరు సమీపంలో ఏపీ పోలీసులు ఉన్న వాహనాన్ని తెలంగాణ పోలీసులు ఆపేశారు. పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజి వ్యవహారంలో నారాయణను అదుపులోకి తీసుకున్నట్టు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులకు వివరించారు. దీంతో, అక్కడ్నించి నారాయణను చిత్తూరుకు తరలించారు.