ఏపీలో పంచాయతీ ఎన్నికలు హోరా హోరీగా జరిగిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. టీడీపీ సహా విపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థులను వైసీపీ నేతలు బెదిరించి ఏకగ్రీవాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బలవంతపు ఏకగ్రీవాలు,నామినేషన్ల విత్ డ్రాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్లు ఉపసంహరణపై ఫిర్యాదులుంటే….ఆ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని ఎస్ఈసీ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ అధికారం ఎస్ఈసీకి లేదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు….ఏకగ్రీవాలైన స్థానాల్లో ఫాం-10 ఇచ్చి ఉంటే ఎస్ఈసీ విచారణ జరపరాదంటూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ క్రమంలోనే ఆ పిటిషన్లపై తుది విచారణ జరిపిన హైకోర్టు తాజాగా కీలక తీర్పునిచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ ఉత్తర్వులను హైకోర్టు పక్కన పెట్టింది. గతంలో ఏకగ్రీవం అయినవారికి వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఏకగ్రీవాలపై దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో ఏకగ్రీవమైన వారికి వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది.ఎన్నికలు నిలిచిపోయిన చోటి నుంచే మళ్లీ ఎన్నికలు జరుపుకోవచ్చునని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజా తీర్పతో నిమ్మగడ్డకు షాక్ తగిలినట్లయింది. మరి, దీనిపై ఎస్ ఈసీ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.