ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని రైతులు చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు వైసిపి నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. దీంతో, తమ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు అంటూ రాజధాని అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, రైతులు చేపట్టిన పాదయాత్రపై రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టును ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ రెండు పిటిషన్ ల పై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులు, ప్రభుత్వం వేసిన రెండు పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేస్తూ షాకింగ్ ఆదేశాలు జారీ చేసింది. ఇక, రైతులు తమ పాదయాత్రను వెంటనే ప్రారంభించుకోవచ్చని, అయితే గతంలో చెప్పినట్టుగా గుర్తింపు కార్డులు ఉన్నవారు మాత్రమే యాత్రలో పాల్గొనాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పాదయాత్ర ప్రారంభానికి ముందు ఇచ్చిన ఆదేశాలను మార్చబోయేది లేదని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులు గుర్తింపు కార్డులు చూపించాల్సిందే అంటూ పోలీసులు పాదయాత్రను అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో, పాదయాత్రకు పోలీసుల నుంచి రక్షణ కల్పించాలంటూ రైతులు హైకోర్టును ఆశ్రయించడం సంచలనం రేపింది. ఇక, యాత్రలో పాల్గొనే రైతులకు తక్షణమే గుర్తింపు కార్డులు జారీ చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
అంతేకాదు, పాదయాత్రకు మద్దతు తెలిపేవారు ఏ రూపంలోనైనా సంఘీభావం ప్రకటించవచ్చని వెల్లడించింది. అయితే, రైతులు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే తమను ఆశ్రయించవచ్చని పోలీసులకు హైకోర్టు సూచించింది. దీంతో హైకోర్టు తాజా తీర్పు జగన్ కు షాక్ ఇచ్చినట్లయింది.