ఏపీలో కరోనా కట్టడి చేశామని, ఆక్సిజన్ కొరత లేదని వైసీపీ నేతలు నిన్నటివరకు గొప్పలు పోయిన సంగతి తెలిసిందే. ఓ వైపు అనంతపురం, కర్నూలులో ఆక్సిజన్ అందక రోగులు చనిపోతున్నారని టీడీపీ నేతలు చెబుతోంటే…అవన్నీ విపక్షాలు గిట్టక చేస్తున్న ప్రచారం అంటూ వైసీపీ నేతలు కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై జరిగిన విచారణ సందర్భంగా జగన్ సర్కార్ కు హైకోర్టు మొట్టికాయలు వేసింది.
ఏపీలో పడకలు, ఆక్సిజన్ లభ్యత, నోడల్ ఆఫీసర్ల పనితీరు, 104 కాల్ సెంటర్, వ్యాక్సినేషన్ పురోగతి తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కు…వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ అంశాలలో ఉన్న లోపాలను తక్షణం సరిదిద్ది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది.
అంతేకాకుండా కరోనా టెస్టుల ఫలితాలను కూడా వేగవంతం చేయాలని సూచించింది. పడకలు లేవని స్వయంగా నోడల్ అధికారులే చెప్పారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అనంతపురం ఆస్పత్రిలో కోవిడ్ మరణాలపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్ల సంఖ్యను పెంచాలని ఏఫీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నోడల్ అధికారులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని సూచించింది.
ఎక్కువ సంఖ్యలో కోవిడ్ పరీక్షలు చేయాలని కోరింది. 45 ఏళ్ల లోపున్న వారికి వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారని, అందరికీ వ్యాక్సిన్ వేయడంలో ప్రభుత్వం ముందున్న ఇబ్బందులేమిటని హైకోర్టు ప్రశ్నించింది. ఏపీకి సమీపాన ఉన్న బళ్లారి, తమిళనాడు నుంచి ప్రభుత్వం కోరిన ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది.