స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోసారి విజయవాడలోని ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణను రేపు ఉదయం 11 గంటలకు కోర్టు వాయిదా వేసింది. ఇక, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపు ఉదయం 10.30 గంటలకు చేపడతామని ఏపీ హైకోర్టు తెలిపింది. ఏసీబీ కోర్టులో విచారణ సందర్భంగా సీఐడీ తరఫు న్యాయవాది, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.
కస్టడీ, రిమాండ్ పిటిషన్లపై గతంలో చెప్పిన అంశాలను మళ్లీమళ్లీ ఎందుకు చెబుతున్నారని, ఆధారాలుంటే చూపాలని కోరారు. నిధుల దుర్వినియోగంపై ఆధారాలుంటే ఇవ్వాలని, చెప్పిందే చెబుతుంటే ఎన్నిసార్లు వింటామని అసహనం వ్యక్తం చేశారు. ఇక, స్కిల్ ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం పొందిందని, చంద్రబాబు మీద కేసు పెట్టడం ఏమిటని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదించారు. స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంట్ ధరను నిర్ధారించిన కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీలో చంద్రబాబు లేరని వాదనలు వినిపించారు.
ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు మధ్యంతర బెయిల్ పై ఉన్నారని, చంద్రబాబుకు నోటీసులివ్వకుండా అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారణ చేస్తున్నారని తెలిపారు. 2 రోజుల కస్టడీ సీఐడీ అధికారులు తీసుకున్నారని, మళ్లీ కస్టడీ అవసరం లేదని అభిప్రాయపడ్డారు.