ఏపీ రాజధానిని తరలించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆ రాష్ట్ర హైకోర్టులో పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.పాలన వికేంద్రీకరణ.. సీఆర్ డీఏ రద్దు అంశాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులపై తాజాగా విచారణ సాగింది. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నోట కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. అంతేకాదు.. సాక్షి పత్రికలో వచ్చిన ఒక కథనం గురించి ఆయన ప్రస్తావించారు. ఈ కథనంపై తాను తన అసంతృప్తిని తెలియజేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏ పత్రికలోనూ విచారణ సందర్భంగా ప్రస్తావించని అంశాల్ని.. సంభాషణల్ని జరిగినట్లుగా రాయటం మంచిది కాదన్నారు.
సదరు కథనం గురించి తనకు సహ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి చెప్పారన్నారు. దీనిపై స్పందించిన సదరు న్యాయమూర్తి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఎన్నో చెబుతుందంటూ హైకోర్టు వ్యాఖ్యానించినట్లుగా సాక్షి పత్రికలో రావటాన్ని తప్పు పట్టారు. దీనిపై స్పందించిన ఏజీ శ్రీరామ్ మాట్లాడుతూ.. తాను ఊర్లో లేనని.. సాక్షి పత్రికలో ఏం వచ్చిందో చూడలేదన్నారు. అయితే.. కోర్టు ప్రొసీడింగ్స్ ను.. జరగని వాటిని జరిగినట్లుగా రాయటానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఈ మధ్యన ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక కథనాన్ని బార్ కౌన్సిల్ సభ్యుడు నాగిరెడ్డి జోక్యం చేసుకుంటూ జడ్జీల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని.. ఆ విషయాన్ని న్యాయమూర్తులే తమకు చెప్పినట్లుగా కథనంలో పేర్కొన్నారన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో కోర్టులో పెండింగ్ లో ఉందని.. అందువల్ల దీనిపై తానేమీ మాట్లాడనని పేర్కొన్నారు. తప్పుగా వార్తలు రాసే పత్రికలపై న్యాయపరంగా ఏమైనా చర్యలు తీసుకోవాలంటే తీసుకోవచ్చన్నారు. కీలక కేసుల విచారణ సందర్భంగా ప్రముఖ మీడియాలో వచ్చిన కథనాలు ప్రస్తావనకు రావటం ఆసక్తికరంగా మారింది.