బాలీవుడ్ బడా హీరోయిన్లలో ఒకరైన ఆలియా భట్‌ను టాలీవుడ్‌కు తీసుకురావడానికి ఇంతకుముందు కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆమె అప్పుడు తెలుగులో నటించడానికి ఒప్పుకోలేదు. కానీ ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చేయడానికి మాత్రం అంగీకరించింది. జక్కన్న సినిమాతో వచ్చే పాపులారిటీ మామూలుగా ఉండదు.
దీని ద్వారా సౌత్ ఇండియాలోనూ పాగా వేసేద్దామని గట్టిగానే ప్లాన్ చేసుకుంది ఆలియా. ఆమె ప్లానింగ్ ఏ స్థాయిలో ఉందంటే.. ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కాకముందే, ఇప్పుడున్న పాపులారిటీతోనే తన కొత్త హిందీ సినిమాను సౌత్ భాషల్లో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయింది. ప్రస్తుతం ఆలియా ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తూనే.. సమాంతరంగా హిందీలో లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘గంగూబాయి ఖతియావాడీ’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మధ్యే రిలీజైన ఈ సినిమా హిందీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘రాజి’ తర్వాత ఆలియా మరోసారి తన స్టార్ పవర్ చూపించే సినిమా ఇదవుతుందని అంచనా వేస్తున్నారు. ‘రాధేశ్యామ్’కు పోటీగా జులై 30న ఈ చిత్రాన్ని హిందీతో పాటు సౌత్ భాషల్లోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘గంగూబాయి’ తెలుగు టీజర్ రెడీ చేశారు. దాన్ని ‘వకీల్ సాబ్’ థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్ని ఆలియానే స్వయంగా వెల్లడించింది.
‘‘అందరికీ నమస్కారం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. బి రెడీ. వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు’’.. తెలుగులో చిలక పలుకులు పలుకుతూ ఆమె ఒక వీడియో సైతం రిలీజ్ చేసింది. ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజైనా కాకముందే తన సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ఆలియా రెడీ అయిపోవడం పట్ల చాలా మంది ఆశ్చర్యపోతూ వాట్ ఎ ప్లానింగ్ అని ఆమెకు కితాబిస్తున్నారు.