ఈ మధ్య సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. నిజం నాలుగూళ్లు దాటేసరికి …అబద్ధం అరవై ఊళ్లు చుట్టేస్తుందన్న రీతిలో…సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, అనధికారిక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, చాలామంది సోషల్ మీడియా యూజర్లు కూడా…తాము షేర్, ఫార్వార్డ్ చేసే వార్తలో, అంశలో నిజానిజాలెంత అన్న కనీస తర్కం లేకుండా….వాటిని వైరల్ చేస్తున్నారు. చివరకు, ఆ వార్త వల్ల బాధితులుగా మారిన వారు స్వయంగా వచ్చి వివరణ ఇచ్చే పరిస్థితులు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ కు సంబంధించిన ఓ వార్త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
భారత ఆర్మీకి సుమన్ వందల కోట్ల రూపాయల విలువ గల భూమిని విరాళంగా ఇచ్చారని, టాలీవుడ్ లో సుమనే రియల్ హీరో అని నెటిజన్లు ఓ పోస్ట్ ను తెగ వైరల్ చేస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి సమీపంలో ఉన్న విలువైన 117 ఎకరాల భూమిని దానం చేశారని, ఆయన నిజంగా మనసున్న మనిషని ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు, స్వయంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆ భూమిని ఆర్మీకి ఇచ్చారని పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ వ్యవహారం ఆనోటా..ఈనోటాపడి సుమన్ కు తెలిసింది. దీంతో, ఆయన ఈ వార్తపై స్పందించారు.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో నిజం లేదని, దానిని నమ్మవద్దని సుమన్ అన్నారు. ఇండియన్ ఆర్మీకి ఇచ్చినట్టుగా చెబుతున్న భూమి ప్రస్తుతం వివాదంలో ఉందని కాబట్టి దానిపై స్పందించకూడదని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉందని చెప్పారు. ఆ భూమికి సంబంధించిన వివాదం పరిష్కారమైన వెంటనే ఆ భూమి తాలూకు విషయాన్ని తానే స్వయంగా వెల్లడిస్తానని చెప్పారు. తాజాగా సుమన్ క్లారిటీ ఇవ్వడంతో అది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది.