శర్వానంద్.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా టాలీవుడ్లో టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడీయన. 2003లో `ఐదో తారీఖు` చిత్రంతో సినీ రంగప్రవేశం చేసిన శర్వానంద్.. `గమ్యం` మూవీతో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత ఈయన చేసిన ప్రస్థానం, జర్నీ, రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి మంచి విజయాలు సాధించాయి.
కెరీర్ సాఫీగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో మళ్లీ శర్వా వరుస ఫ్లాపుల్లో మునిగిపోయాడు. పడి పడి లేచే మనసు, రాధ, రణరంగం, జాను, మహాసముద్రం ఇలా ఈయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. `ఆడవాళ్ళు మీకు జోహార్లు` సినిమాతో అయినా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని శర్వానంద్ ఎంతగానో ఆశపడ్డాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది.
మార్చి 4న విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఇదిలా ఉంటే.. శర్వానంద్ గురించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. వరుసగా అరడజన్ సినిమాలు పరాజయం పాలైనా శర్వానంద్ తన రెమ్యునరేషన్ మాత్రం తగ్గించుకోవడం లేదట. రూ. 10 కోట్లు ఇస్తేనే సినిమా చేస్తానని ఖరాకండిగా చెప్పేసి నిర్మాతలకు శర్వానంద్ చుక్కలు చూపిస్తున్నాడట.
ఈ క్రమంలోనే మూడు పెద్ద ప్రొడక్షన్స్‌లో చేయాల్సిన సినిమాలు చేజారాయని కూడా టాక్ నడుస్తోంది. అయితే రెమ్యునరేషన్ విషయంలో శర్వాపై వస్తున్న వార్త రూమరే అని చాలా మంది కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే, శర్వానంద్ ఎంతో నెమ్మదస్తుడు, వివాదాల జోలికి పోనేపోడు, అన్నిటికీ మించి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాడు. అటువంటి వ్యక్తి పారితోషికం విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నాడని అనడం అస్సలు నమ్మేలా లేదని అంటున్నారు.