ఏపీలో సినిమా థియేటర్ల కలెక్షన్ల కంటే కిరాణా షాప్ ల కలెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయంటూ హీరో నాని చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. నాని వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు కూడా కౌంటర్ ఇచ్చారు. హీరోల రెమ్యున్ రేషన్లు తగ్గించుకోవాలంటూ హితవు పలికారు. ఆ వ్యాఖ్యల వేడి తగ్గక ముందే నాని మరోసారి షాకింగ్ కామెంట్లు చేయడం చర్చనీయాంశమైంది.
వకీల్‌సాబ్ సినిమా విడుదల సమయంలో థియేటర్ల సమస్య చర్చకు వచ్చిందని, ఆనాడే ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా పోరాడి ఉంటే బాగుండేదని నాని చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ లో ఐక్యత లేదని, అంతా ఒకే తాటిపై ఉంటే ఈ టికెట్ రేట్ల సమస్య ఎప్పుడో పరిష్కారం అయి ఉండేదని నాని అన్నారు. ఆనాడే టాలీవుడ్ పెద్దలంతా కలిసికట్టుగా సరిగ్గా చెప్పి ఉంటే.. అధికారులు కూడా ఆలోచించి ఉండేవారేమోనని అభిప్రాయపడ్డారు. తాను ఎవరినీ బాధపెట్టాలని ఇలా మాట్లాడడం లేదని, తన అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడిస్తున్నానని అన్నారు.
ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై తన అభిప్రాయం మాత్రమే చెప్పానని, కానీ కొందరు దానిని పెద్ద ఇష్యూ చేశారని అన్నారు. 4 రోజుల క్రితం తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఒక్కొక్కొరు ఒక్కో విధంగా అర్థం చేసుకున్నారని నాని అన్నారు. టికెట్ ధరలను తగ్గించడం సినీ ప్రేక్షకులను అవమానించడమేనంటూ తాను చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో వేరే విధంగా ట్రోలింగ్ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నాని వ్యాఖ్యలకు కొందరు దర్శక నిర్మాతలు మద్దతు పలుకుతున్నారు.