అవును! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ టాపిక్ హల్ చల్ చేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ వేస్తున్న అడుగులు, చేస్తున్న తప్పులు.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు రేటింగ్‌ను గడిచిన మూడు మాసాల కాలంలో అమాతం పెంచాయనే అంటున్నారు పరిశీలకులు. నిజానికి గత ఏడాది ఎన్నికల తర్వాత చంద్రబాబు ఒక్కసారిగా నిర్వేదంలోకి వెళ్లిపోయారు. వయసు చూస్తే.. 70 దాటడం, పార్టీ ఎప్పుడూ లేనంతగా భారీ ఓటమిని చవిచూడడం, గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కావడం.. ఓడిన వారు కూడా సైకిల్ దిగిపోవడం వంటివి ఆయనను కలిచి వేశాయి.
ఇక, పార్టీలోనూ చంద్రబాబు తర్వాత పగ్గాలు చేపట్టేది.. లోకేష్ కాబట్టి.. ఆయనకు మద్దతు తెలపడంపైనా అనేక తర్జనభర్జనలు సాగాయి. మరోవైపు జగన్ తొలినాళ్లలో దూకుడుతో తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ, పింఛన్ల పెంపు, అమ్మ ఒడి సహా ఇతర పథకాలతో ఆ పార్టీ రేటింగ్ పుంజుకుంది. అదేసమయంలో అసెంబ్లీలో చంద్రబాబును ఏకేయడం వంటివి పార్టీకి కలిసివచ్చాయి. ఈ నేపథ్యంలో ఇక, టీడీపీ పరిస్థితి, అధినేతగా చంద్రబాబు వ్యూహాలు తీవ్రంగా దిగజారాయని అందరూ అనుకున్నారు. టీడీపీలోని ఓ వర్గం నేతలు.. బాబు తప్పుకోవడమే మంచిదనే అభిప్రాయాలు వెల్లడించారు. కానీ, గడిచిన ఆరు మాసాల్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా పుంజుకున్నారనేది తాజా టాక్.
జగన్ ప్రభుత్వం ఎప్పుడైతే.. అమరావతి రాజధానిని మారుస్తామని ప్రకటించిందో.. అప్పటి నుంచి బాబు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. రాజధాని విషయాన్ని రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయడంలోను, తెలుగు మాధ్యమం ఎత్తివేతను వ్యతిరేకించడంతోపాటు.. దీనికి సానుకూలంగా మేధావి వర్గాన్ని తనవైపు తిప్పుకోవడంలోను ఆయన సక్సెస్ అయ్యారు. ఇక, తాజాగా జగన్ న్యాయవ్యవస్థపై చేస్తున్న వివాదాల విషయంలో చంద్రబాబు వ్యూహాత్మక మౌనం పాటించి.. మేధావి వర్గాన్ని రంగంలోకి దింపడంలోనూ మరింత సక్సెస్ కావడంతో .. బాబు అయితే.. బాగుండేదనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన రేటింగ్ పెరిగిందని అంటున్నారు.
సామాన్య ప్రజల్లోనూ.. ఇదే చర్చ నడుస్తోందని అంటున్నారు పరిశీలకులు. వీటికితోడు.. వైసీపీలో ఓ వర్గం నాయకులు, ముఖ్యంగా జగన్ సామాజిక వర్గం నేతలే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండడం, మావోడు.. లేనిది కెలుక్కుని.. ఆయనను, మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారనే వ్యాఖ్యలు రావడంతో వైసీపీలోకి జంప్ చేయాలని అనుకున్న నాయకులుకూడా ఇప్పుడు టీడీపీనే బెటర్ అనే భావనతో ఉండడం బాబుకు కలిసి వచ్చిన పరిణామంగా చెబుతున్నారు. ఇదే స్థాయిని మరో ఏడాది కొనసాగిస్తే.. టీడీపీ మళ్లీ పుంజుకోవడం ఖాయమని అంటున్నారు.