హరీష్ శంకర్ కొత్త చిత్రం‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్‌కు రెడీ అవుతున్న సమయంలోనే అతను తన తర్వాతి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేసే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయిన నేపథ్యంలో చిరుతో హరీష్ సినిమా నిజంగానే సాధ్యపడుతుందా అన్నది సందేహంగానే ఉంది. ఐతే సినిమా సంగతేమో కానీ.. చిరునైతే హరీష్ డైరెక్ట్ చేసేశాడు అన్నది టాలీవుడ్ తాజా కబురు. ఇటీవలే చిరు.. ఒక యాడ్ చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఆ ప్రకటనను హరీషే డైరెక్ట్ చేశాడట.
రెండు రోజుల వ్యవధిలో ఈ యాడ్ షూట్ పూర్తయినట్లు సమాచారం. ఈ ప్రకటన ఏ బ్రాండ్‌కు సంబంధించిందనే వివరాలు బయటికి రాలేదు కానీ.. హైదరాబాద్‌లోనే షూట్ పూర్తయింది. సినిమా సాధ్యమవుతుందో లేదో కానీ.. ఈ రకంగా అయినా చిరును డైరెక్ట్ చేసిన సంతృప్తి ఆయన అభిమాని అయిన హరీష్‌కు ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ వర్క్‌తో ఇంప్రెస్ చేస్తే ‘మిస్టర్ బచ్చన్’ ఫలితంతో సంబంధం లేకుండా హరీష్‌కు చిరు ఛాన్స్ ఇచ్చినా ఇవ్వొచ్చు.
‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ముగ్గురినీ కలిపి మల్టీస్టారర్ తీయడానికి ఓ లైన్ రెడీ చేసినట్లు హరీష్ శంకర్ తెలిపాడు. అది చాలా పెద్ద కాన్వాస్ ఉన్న కథ అని.. ఈ కాంబినేషన్ కుదిరితే సినిమా చేయడానికి రెడీ అని అన్నాడు. ఐతే ‘మిస్టర్ బచ్చన్’ అంచనాలను అందుకుని ఉంటే.. ఈ మల్టీస్టారర్ కాకపోయినా కనీసం చిరుతో అయినా సినిమా చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు చిరు అవకాశం ఇవ్వడం కష్టమే కావచ్చు. రామ్ చరణ్ సైతం హరీష్‌కు దొరక్కపోవచ్చు. పవన్ కళ్యాణ్‌తో మాత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను పూర్తి చేయాల్సి ఉంది. పవన్ అందుబాటులోకి రావడాన్ని బట్టి ఈ సినిమా పూర్తవుతుంది.