తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు.. కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ రాజకీయ వ్యూహాలపై అనేక కథనాలు వస్తున్నాయి. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రిగా, సీనియర్ రాజకీయ నాయకుడుగా ఆయనకు పెద్ద పరిచయమే ఉంది. తాజా రాజీనామా నేపథ్యంలో ఆయన ఏదైనా ప్రధాన రాజకీయ పార్టీలో చేరతారా? సొంత పార్టీ పెడతారా? రాజకీయాలకు పూర్తిగా దూరమవుతారా? అనే ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. అయితే.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన ఆజాద్.. కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆయన సన్నిహితుడు ఒకరు ఈ విషయం చెప్పారు.
‘ఆజాద్ బీజేపీలో లేదా మరే ఇతర పార్టీలో చేరరు. కొత్త పార్టీని స్థాపించే అవకాశం ఉంది. కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకులతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో మీరు మరిన్ని రాజీనామాలను చూస్తారు. వారందరూ ఆజాద్ వెంట నడుస్తారు.“ అని ఆయన ఓమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మరోవైపు ఆజాద్ రాజీనామా తర్వాత.. అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఆజాద్ రాజీనామాకు మద్దతుగా జమ్ముకశ్మీర్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు రాజీనామా చేశారు. వారిలో జి.ఎం. సరూరీ, హాజీ అబ్దుల్ రషీద్, మహ్మద్ అమీన్ భట్, గుల్జార్ అహ్మద్ వాణీ, చౌదరి మహ్మద్ అక్రమ్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం సహా పార్టీలోని అన్ని పదవులకు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం ఉదయం రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి నాలుగు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. అగ్రనేత రాహుల్ గాంధీ వ్యవహార శైలి సహా పార్టీ అధినాయకత్వం పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
“ఏఐసీసీని నడిపే కోటరీ ఆధ్వర్యంలో పోరాడాలన్న సంకల్పం, సామర్థ్యాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. భారత్ జోడో యాత్ర కన్నా ముందు పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ జోడో యాత్రను చేపట్టాల్సింది” అని గులాం నబీ ఆజాద్ దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీ ప్రవేశంతోనే కాంగ్రెస్‌కు కష్టాలు ఆరంభమయ్యానని ఆజాద్ ఆరోపించారు. రాహుల్ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు అయ్యాక పార్టీ నాశనమైందని, అనుభవజ్ఞులైన నేతలను రాహుల్ పక్కకు పెడుతున్నారంటూ విమర్శించారు.
కొత్త కోటరీ ఏర్పాటు చేసుకొని అపరిపక్వ రాజకీయాలు చేశారని విమర్శించారు. పార్టీలోని సంస్థాగత మార్పుల కోసం లేఖ రాసిన 23 మంది నేతలను తీవ్రంగా అవమానించారని అని ఆయన అన్నారు. అయితే.. ఆజాద్‌పై కాంగ్రెస్ నేతలు ఎదురు దాడికి దిగారు. ఆయన డీఎన్ ఏ మోడీఫీడ్(మారిపోయింది) అయిందని పంచ్‌లు విసిరారు. మోడీ చేతిలో ఆయన రిమోట్ కంట్రోల్‌గా మారిపోయారని.. రాహుల్ మద్దతు దారులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు.
Comments 1