టాలీవుడ్ నిర్మాత టి శిల్పా చౌదరి మరియు ఆమె భర్త టి శ్రీనివాస్ ప్రసాద్‌ల కోట్ల రూపాయల మోసం కేసుపై నార్సింగి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇప్పటికే ఆమెపై పలు కేసులుండగా.. 2 కోట్ల రూపాయల మేర మోసం చేసిందని శిల్పపై ఆదివారం మరో మహిళ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. ఇప్పటి వరకు ఆరుగురు బాధితులను గుర్తించి నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి.
ఈ జంట సినీ పరిశ్రమ, రాజకీయ నాయకులు, వ్యాపార కుటుంబాలకు చెందిన ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్లు మొదలైన వాటిలో థీమ్ బేస్డ్ పార్టీలు, కిట్టీ పార్టీలు మరియు ఇతర సామాజిక సమావేశాలకు వారిని ఆహ్వానించినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
కిట్టీ పార్టీలకు ఖరీదైన మరియు విలాసవంతమైన ఆహారం మరియు ఖరీదైన పానీయాలు సమకూర్చేవారు. అటువంటి పార్టీలకు వచ్చిన అతిథులను వలలో వేసుకునేవారు. ఎక్కువగా సంపన్న మహిళలు తమ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేలా చేశారు. వారికి అధిక రాబడిని ఇస్తారని హామీ ఇచ్చారు. ఇలా ఇన్వెస్టర్ల నుంచి దాదాపు రూ.80 కోట్లు వసూలు చేసి మోసం చేసినట్లు అంచనా.
ఇలా దంపతులు సేకరించిన సొమ్మును రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించారు. నగదు బదిలీ అయిన కొన్ని ఖాతాలను గుర్తించిన పోలీసులు, డబ్బు వసూలు చేసి దారి మళ్లించిన ఇతర మార్గాలను కూడా విచారిస్తున్నారు.
అంతేకాకుండా, డబ్బు తిరిగి ఇవ్వాలని మహిళా పెట్టుబడిదారులు దంపతులను డిమాండ్ చేయడంతో, శ్రీనివాస్ వారిని బెదిరించాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో తనకు సన్నిహితులు ఉన్నారని చెబుతూ.. వారి నోరు మూయించేవారు.
కోట్లాది రూపాయల మోసానికి సంబంధించి శనివారం అరెస్టు చేసిన దంపతులను పోలీసు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్లో కోరారు. ఇరుపక్షాలను విచారించిన న్యాయస్థానం విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది.