ఏపీ ప్రభుత్వంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంచలన కామెంట్లు చేశారు. తాజాగా.. ఆయన అప్పుల విషయంలో తన పేరు ఎందుకు చేర్చారంటూ.. ప్రభుత్వాన్ని నిలదీసినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పెద్ద చర్చే జరిగిందని.. ప్రభుత్వం దీనిపై ఆత్మరక్షణ లో పడిందని.. వెంటనే మార్పుల కోసం ప్రయత్నిస్తోందని.. వార్తలు వచ్చాయి.
ఇదిలావుంటే.. ఇప్పుడు మరోసారి జగన్ ప్రభుత్వం పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబరు 1న నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ప్రజలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే.. సాధారణానికి భిన్నంగా ఆయన ప్రభుత్వంపై వ్యాఖ్యలుచేశారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విజయానికి ప్రజల సంతోషమే కొలమానమని.. పారదర్శకత, సుపరిపాలన ప్రభుత్వ ప్రధాన లక్షణంగా ఉండాలని గవర్నర్ పిలుపునిచ్చారు. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, సమృద్ధిగా సహజ వనరులను రాష్ట్రం కలిగి ఉందన్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన దివంగత పొట్టి శ్రీరాములును స్మరించుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్య శైలి భారతీయ సంప్రదాయంలో విశిష్టమైనదని గవర్నర్ పేర్కొన్నారు.
దేశ భాషలందు తెలుగు లెస్స అన్న తీరుగానే తెలుగు భాష ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని కలిగి ఉండి అద్భుతమైన నాణ్యతకు ప్రసిద్ధి చెందిందన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం.. అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే ఆ సంక్షేమఫలాలు అర్హులైన ప్రతి వ్యక్తికి అందేలా చూడాలి’ అని గవర్నర్ అన్నారు.
ప్రభుత్వ విజయానికి ప్రజల సంతోషమే కొలమానమని.. పారదర్శకత, సుపరిపాలన ప్రభుత్వ ప్రధాన లక్షణంగా ఉండాలని గవర్నర్ పిలుపునిచ్చారు. సామాన్య ప్రజల కలలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలల్లో మరింత విజయాన్ని సాధించాలని బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు.
అయితే, ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజల కోసం.. కాకుండా.. పార్టీ కోసం.. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రధాన ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై హైకోర్టు కూడా పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
సుపరిపాలన అంటే ఇదేనా..? అని ఇటీవల హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సుపరిపాలన విషయంపై గవర్నర్ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం.. కామెంట్లు చేయడం వంటివి ఇపుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.