ఏపీలో అనధికారిక సీఎంగా సజ్జల వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డికి జగన్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని వారు దుయ్యబడుతున్నారు. ఇక, నేను ఉన్నాను…నేను విన్నాను అని జగన్ ఎన్నికలకు ముందు చెప్పారని…సజ్జల ఉన్నాడు..సజ్జల వింటాడు…సజ్జల చేస్తాడు …అని చెప్పలేదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా సెటైర్లు వేశారు. ఈ క్రమంలోనే సజ్జలపై టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సజ్జల ఏ అధికారంతో ప్రభుత్వ నిర్ణయాలను చెబుతున్నారని గోరంట్ల నిలదీశారు. అలా ప్రభుత్వ నిర్ణయాలు మీడియాకు వెల్లడించేందకు సజ్జలకు ఏ రైట్ ఉంది? అని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జలను గవర్నర్ నియమించలేదని, కానీ, ఆయన పోలీస్ శాఖపై అజమాయిషీ చేసి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడని మండిపడ్డారు. రేపు ప్రభుత్వం మారితే ముందుగా జైలుకు వెళ్లేది సజ్జలేనని హెచ్చరించారు. సలహాదారులు తమ పరిధి దాటకూడదని, ఆమాటకొస్తే సలహాదారుల వ్యవస్థనే జగన్ భ్రష్టుపట్టించాడని మండిపడ్డారు.
కొడాలి నాని పనికిమాలిన చెత్తమంత్రి అని, నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడతారని గోరంట్ల దుయ్యబట్టారు. జగన్ ను కాకా పడితే మంత్రి పదవిలో కొనసాగవచ్చన్నది నాని భావన అని విమర్శించారు. ఏరుదాటి తెప్పగలేసిన చందంగా అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలిచ్చిన జగన్… ఈ రోజు ఉద్యోగులకు శఠగోపం పెట్టాడని ఎద్దేవా చేశారు. మంత్రులు, సీఎం, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… కర్రపెత్తనం చేస్తూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం దివాళా అంచులకు వెళుతోందని, అబద్ధాలు చెప్పడంలో బొత్స ఆరితేరారని చురకలంటించారు. బాధితుల పక్షాన నిలబడకుండా, దుర్మార్గుల పక్షాన నిలబడడం పోలీసుల నైజమా అని పోలీస్ అధికారుల సంఘాన్ని బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.