ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆలయాలకు వెళ్లడమే కానీ, ఆయన ఎక్కడా కానుకలు ఇచ్చినట్టుగా మన కు పెద్దగా తెలియదు. ఇచ్చి ఉంటే.. ఖచ్చితంగా దానిని ఆయన ప్రత్యేకంగా ప్రచారం చేసుకునేవారు. అయితే.. తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాని మోడీ కాళికా అమ్మవారికి బహూకరించిన పసిడి కిరీటం చోరీకి గురైందట. దీని విలువ సుమారు 50 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. పైగా దసరా శరన్నవరాత్రులు జరుగుతున్న సమయంలో ఈ చోరీ జరగడం మరింత చర్చనీయాంశం అయింది.
ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా అనేక ఆలయాలకు వెళ్లారు. అనేక పూజలు, దీక్షలు కూడా చేపట్టారు. ఎన్నిక ల సమయంలో తమిళనాడుకు వెళ్లి.. అక్కడి వివేకానందరాక్లో దీక్ష చేశారు. ఇలా.. మోడీకి-ఆలయాల కు-పూజలకు అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇలా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశాలకు వెళ్లినప్పుడు కూడా అక్కడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ విధంగానే 2021లో ఆయన ప్రధాని హోదాలోనే పొరుగుదేశం, ఇటీవల తీవ్ర వివాదాస్పదమైన దేశం బంగ్లాదేశ్‌కు వెళ్లారు.
ముస్లిం మెజారిటీ ప్రాబల్యం ఉన్న ఆ దేశంలో హిందూ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే సత్ ఖీరా జిల్లాలో జెశోరేశ్వరి పేరుతో కాళికామాత ఆలయం ఉంది. ప్రధాని అప్పట్లో ఈ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తన వేతనం నుంచి వచ్చిన సొమ్ముతో ఆయన అమ్మవారికి బంగారు కిరీటం చేయించారు. దీనిని అప్పట్లో హైలెట్ చేశారు. అయితే.. ఈ పసిడి కిరీటం .. బంగ్లాదేశ్ లో తాజాగా గురువారం మధ్యాహ్నం చోరీకి గురైంది.
ప్రస్తుతం శరన్నవరాత్రులు కావడంతో బంగ్లాదేశ్‌లోని హిందువులు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జెశోరేశ్వరి ఆలయంలోనూ రద్దీ ఎక్కువగా ఉంది. గురువారం మధ్యాహ్నం.. ఆలయ పూజారి పూజలు చేసిన తర్వాత.. ఇంటికి వెళ్ళిపోయారు. తిరిగి వచ్చి చూసే సరికి గర్భాలయంలో అమ్మవారికి మోడీ బహూకరించిన పసిడి కిరీటం కనిపించకపోవడాన్ని ఆయన గుర్తించి.. అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది చోరులను గుర్తించేందుకు హుటాహుటిన కదిలింది.
మోడీ ఆవేదన..
ఈ చోరీ వ్యవహారం వెలుగులోకి రావడం ఆలస్యమైంది. బంగ్లాదేశ్ ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. అయితే.. చివరకు అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనంతో ఈ విషయం బయటకు తెలిసింది. ఈ విషయం తెలిసిన ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాధ్యమైనంత వేగంగా కిరీటాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆయన బంగ్లా ప్రభుత్వానికి విన్నవించారు.