విశాఖ మర్రిపాలెం భూ వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి గతంలో హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. విశాఖలో తనకు చట్టబద్ధంగా సంక్రమించిన భూమిని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ప్రముఖ వ్యాపారవేత్త కాట్రగడ్డ లలితేష్ కుమార్ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే, ఆ పిటిషన్పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి…ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 115ను కొట్టివేసింది. దీంతో, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
అక్కడ కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది.
ఆ వ్యవహారంపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జీవో 115పై ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించడంతో జగన్ కు షాక్ తగిలినట్లయింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సీజేఐ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సమర్ధించింది. కాట్రగడ్డ లలితేశ్ కుమార్కు కేటాయించిన స్థలాన్ని వెనక్కు తీసుకోవాలనుకున్న ఏపీ ప్రభుత్వం నిర్ణయం సరికాదని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వమే స్థలాన్ని కేటాయించి మళ్లీ వెనక్కి తీసుకోవడం ఏమిటి అని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.