కూటమి అభ్యర్థులను గాజు గ్లాసు గజగజా వణికిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జనసేన పార్టీ 21 శాసనసభ, 2 పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తున్నది. అవి మినహా జనసేన గుర్తు గాజు గ్లాసును ఎన్నికల కమీషన్ స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. కోర్టులో పోరాడినా, ఎన్నికల కమీషన్ కు ఎన్ని వినపతిపత్రాలు ఇచ్చినా జనసేనకు ఊరట లభించలేదు. దీంతో జనసేన పోటీలో లేని చోట గాజు గ్లాసు గుర్తు వచ్చిన వారితో కూటమి అభ్యర్థులకు తలబొప్పి కడుతుంది.
విశాఖ ఉత్తర శాసనసభ నియోజకవర్గంలో 2019 ఎన్నికలలో జనసేన పార్టీ 19,139 ఓట్లు సాధించింది. అక్కడ గెలిచిన టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు 67352 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి కమ్మీల కన్నపరాజుకు 65408 ఓట్లు వచ్చాయి. కేవలం 1944 ఓట్ల తేడాతో టీడీపీ విజయం సాధించింది.
ఈ ఎన్నికలలో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుండి బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తుండగా, గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన కన్నపరాజు మరో సారి వైసీపీ తరపున పోటీ చేస్తున్నాడు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఈ స్థానం బీజేపీకి కేటాయించారు.
ఇక్కడ జనసేన పోటీలో లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వడ్డి శిరీషకు ఎన్నికల కమీషన్ గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. గత ఎన్నికల్లో 10 శాతం పైగా ఓట్లు సాధించిన గాజు గ్లాసుకు ఈ సారి ఒకటి, రెండు శాతం ఓట్లు పడినా తన ఓటమి ఖాయమని భావించిన బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు స్వతంత్ర అభ్యర్థి శిరీషను ప్రచారం చేయొద్దని కోరాడు.
దీంతో ఆమె తన గుర్తు బ్యాలెట్ పత్రంలో ఉన్నా దానికి ఎవరూ ఓటేయవద్దని, ఈ ఎన్నికల బరి నుండి తాను తప్పుకుంటున్నానని, ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి కమలం గుర్తుకు, ఎంపీగా టీడీపీ అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆమె మీడియా సమావేశం పెట్టి స్పష్టం చేసింది. ప్రచారంలో గాజు గ్లాసు లేకున్నా బ్యాలెట్ లో గాజు గ్లాసు కనిపిస్తుంది. మరి ఈ కాంప్రమైజ్ ఎన్నికల్లో ఎంత వరకు పనిచేస్తుందో వేచిచూడాలి.