గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జోరుకు గా దూసుకుపోతోంది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలను రంగంలోకి దింపిన బీజేపీ ఇక్కడ వస్తున్న రెస్పాన్స్ చూసి ఆశ్చర్యం చెందిందట. మూడ్ చూస్తే తామే గెలుస్తాం అన్న నమ్మకం పెరగడంతో ఇపుడు ఆ క్రెడిట్ కోసం ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతున్నారట. అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హైదరాబాదులో ప్రచారం చేస్తుండటం సంచలనం అవుతోంది.
వాస్తవానికి చాలామంది మరిచిపోయిన విషయం ఏంటంటే… ఏడాది క్రితమే అమిత్ షా ఇక్కడకు వచ్చి గ్రేటర్ ఎన్నికల కోసం సమావేశం పెట్టారు. అప్పటి నుంచే వారు వ్యూహాలతో రెడీగా ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక కూడా చాపకింద నీరులా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. అందుకే సడెన్ గా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా టీఆర్ఎస్ కంటే ఎక్కువ నామినేషన్లు వేయగలిగారు. ఎట్టి పరిస్థితుల్లోను ghmc లో గెలవాలని లక్ష్యం పెట్టుకుంది బీజేపీ.
ఇక తాజాగా తేజస్వి సూర్య సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. తాజాగా మరికొంతమంది నేతలు అగ్ర నేతలు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వారి హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఈరోజు విడుదల చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన భూపేంద్ర యాదవ్ కూడా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ ధర్మపురి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్‌రావు వంటి వారు హైదరాబాద్‌లో ప్రచారంలో పాల్గొంటున్నారు. మరో మూడేళ్లలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ghmc లో గెలుపు పార్టీకి చాలా బలాన్నిస్తుందని బీజేపీ ఆలోచన.