విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారంలో జగన్ సర్కార్ పై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ ఉదాసీన వైఖరి వల్లే చరిత్రాత్మక ఫ్యాక్టరీని కేంద్రం బేరానికి పెట్టిందని టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఇంత జరగుతున్నా జగన్ కంటితుడుపు చర్యగా కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ నార్త్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజీనామా చేశారు.
ఇంతవరకు బాగానే ఉంది. అయితే, టీడీపీ నేతలకు భిన్నంగా గంటా…. మోడీకి జగన్ లేఖ రాయడంపై ధన్యవాదాలు చెప్పారు. అంతేకాదు, గౌరవ ముఖ్యమంత్రి జగన్ వెళ్లి గౌరవ ప్రధాన మంత్రి మోడీని నేరుగా కలిసి విశాఖ ఉక్కును ఆంధ్రుల హక్కును వెనక్కు తేవాలని విన్నపాలు చేశారు. ఈ మధ్య కాలంలో యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటోన్న గంటా….హఠాత్తుగా యాక్టివ్ అయి రాజీనామా చేయడం ఏమిటన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
గంటా రాజీనామా వెనుక వేరే ఉద్దేశ్యం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భాన్ని సాకుగా చూపి రాజీనామా చేసి….ఆ తర్వాత వైసీపీకి మద్దతు పలికేందుకే గంటా వ్యూహ రచన చేశారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అంతేకాదు, ఈ ప్రచారానికి బలం చేకూరేలా గంటా ప్రకటనలు, ప్రవర్తన ఉండడం కూడా ఆ అనుమానాలకు ఆజ్యం పోస్తోంది.
కొద్ది రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా వైసీపీలో చేరతారన్న ప్రచారం జరగడం…దానిని గంటా ఖండించడం తెలిసిందే. అలా అని గంటా టీడీపీ కార్యక్రమాల్లోగానీ, అసెంబ్లీ సమావేశాల్లో గానీ, పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీతో వాడీవేడీగా జరుగుతున్న మాటల యుద్ధంలో గానీ వేలు పెట్టలేదు. విశాఖ వైసీపీ నేతలు గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకించడం ఇందుకు ఒక కారణమైతే…ఈ విషయం టీడీపీ నేతలకూ తెలియడంతో అటు టీడీపీలో ఇమడలేకపోవడం మరోకారణం. గంటా ఏ క్షణంలోనైనా గోడ దూకొచ్చని భావించిన చంద్రబాబు….వైజాగ్ నార్త్ లో ఇద్దరిని ప్రధాన కార్యదర్శులుగా, ఒకరికి కార్యదర్శిగా పదవులు ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.
కరెక్టుగా ఈటైంలోనే విశాఖ స్టీల్ ప్రైవేటికరణ అంశం తెరపైకి వచ్చింది. దీంతో, అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న గంటా…సందట్లో సడేమియా అంటూ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మెల్లగా జగన్ ను కలిసి మెడలో కండువా వేసుకొని వల్లభనేని వంశీ, కరణం బలరాంలా ఉండాలని గంటా ఫిక్సయ్యారని టాక్ వస్తోంది. దీనికితోడు, త్వరలోనే వైసీపీలో గంటా చేరబోతున్నారనేందుకు ఇంకా అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
ఓ వైపు జగన్ కు తెలిసే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారంటూ టీడీపీ నేతలు ఏకి పారేస్తుంటే… మోడీకి జగన్ లేఖ రాయడాన్ని గంటా ఆహ్వానించారు. ఇంకా, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా పరిష్కార మార్గాలన్నింటినీ లేఖలో ప్రస్తావించిన జగన్కు గంటా ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే, గంటా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయలేదు. కనుక, అది సాంకేతికంగా చెల్లుబాటు కాదు.కానీ, స్పీకర్ విచక్షాధికారంతో దానిని ఆమోదించే అవకాశముంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తర్వాతే రాజీనామా ఆమోదించాలని కోరారు.
ఇదే విషయంపై గంటాను ఓ విలేకరి ప్రశ్నిస్తే…అవసరమైతే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తానని చెప్పారు గంటా. కాబట్టి ఇది నామ్ కా వాస్తే రాజీనామా అన్న టాక్ వస్తోంది. ఒక వేళ ప్రైవేటీకరణ ఆగితే రాజీనామా వెనక్కు తీసుకుంటారన్నమాట. వైసీపీలో చేరేందుకే ఈ సమయంలో రాజీనామా చేశారా అని విలేకరులు అడిగితే…గంటా ఓ చిరునవ్వు నవ్వి ఆ ప్రశ్నను దాటవేశారు. ఇలా, గంటా ప్రకటనలు…వ్యవహారం చూస్తుంటే….త్వరలోనే వైసీపీలోకి జంప్ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. మరి, ఆ ప్రచారం, ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయన్నదానికి కాలమే సమాధానమివ్వాలి.