జగన్ లేఖను కేంద్రం లెక్క చేస్తుందా?

ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు అంటూ నినదించి.. పట్టుబట్టి సాధించుకున్న కర్మాగారాన్ని పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో అమ్మేద్దామన్న మోడీ సర్కారు నిర్ణయంపై ఆంధ్రోడు రగిలిపోతున్నాడు. బంగారం లాంటి కంపెనీని తాత్కాలిక నష్టాల బూచిని చూపించి అమ్మేయటం ఏమిటన్న అక్రోశం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇలాంటివేళ.. ఏపీ సీఎం స్పందన ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. దీనిపై తాజాగా ప్రధాని మోడీకి  లేఖ రాశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మటానికి బదులుగా ఏమేం చేయొచ్చన్న ప్రత్యామ్నాయాల్ని ఆయన సూచిస్తూ సుదీర్ఘంగా లేఖ రాశారు. అందులో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి.

అమ్మాలన్న ఆలోచనను పక్కన పెట్టి.. ఏమేం చేస్తే నష్టాల్లో నుంచి సంస్థ లాభాల్లోకి వస్తుందన్న అంశాల్ని సీఎం జగన్ సూచనలు చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ కన్నా అండగా ఉండి చేయూనితనివ్వాలని..  కేంద్రంతో కలిసి పని చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా  ఉందన్నారు. దీర్ఘకాలం పోరాడి సాధించుకునన ప్లాంట్ అన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. 2002 నుంచి 2015 వరకు సంస్థ లాభాల్లోనే ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సొంత గనులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని.. ఉక్కు కర్మాగారం లాభాలబాట పడుతుందన్నారు. రుణాల్ని ఈక్విటీలుగా మారిస్తే వడ్డీ భారం ఉండదన్న కీలక సూచన చేవారు. సంస్థ పునరుద్ధరణ కోసం రాష్ట్రం అన్ని విధాలుగా కేంద్రంతో పని చేయటానికి సిద్ధంగా ఉందన్నారు.

రాష్ట్రానికి ఆభరణమైన ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వం కాపాడుకుంటుందని జగన్ పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్.. కేంద్ర ఉక్కు శాఖ కింద పని చేస్తూ నవరత్నాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దాదాపు 20వేల మందికి ప్రత్యక్షంగానూ.. వేలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్లో అతి పెద్దదిగా నిలుస్తోంది. దేశంలోని సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటైన తొలి స్టీల్ ప్లాంట్ అయిన విశాఖ అత్యంత నాణ్యమైన ఉక్కును తయారు చేస్తూ.. నిర్మాణ.. మౌలిక వసతులకు.. ఉత్పత్తితో పాటు.. ఆటోమొబైల్ రంగం అవసరాల్ని కూడా తీరుస్తోంది. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం భారీ ఎత్తున ఉద్యమం చేసి 32 మంది తమ ప్రాణాల్ని త్యాగం చేసిన ఘన చరిత్ర ఈ సంస్థ సొంతం.

అమ్మకానికి బదులుగా ఏమేం చేయొచ్చో చెబుతూ.. ప్రధాని మోడీకి రాసిన లేఖలో ఏపీ సీఎం జగన్ చేసిన సూచనలు చూస్తే..
2002 నుంచి 2015 వరకు విశాఖ ఉక్కు కర్మాగారం అత్యుత్తమ పని తీరు ప్రదర్శించి లాభాలబాటలో నడిచిందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. విశాఖ నగరంలోనే ఉన్న స్టీల్‌ ప్లాంట్‌కు 19,700 ఎకరాల భూమి ఉంది. దాని ప్రస్తుత మార్కెట్‌ విలువే సుమారు లక్ష కోట్లకు పైగా ఉంటుంది.

సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్‌ టన్నులు కాగా, ఇటీవలే ఆర్ఐఎన్ఎల్‌ సంస్థను ఆ«ధునీకరించడంతో పాటు, ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి విస్తరణ చర్యలు చేపట్టింది. ఆ దిశలో వనరుల సేకరణ కోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాంద్యం కారణంగా విశాఖ ఉక్కు క్రమంగా నష్టాల బాట పట్టింది. సొంతంగా గనులు లేకపోవటంతో ఉత్పత్తి వ్యయం దారుణంగా పెరిగి.. లాభాలు పడిపోయాయి. విశాఖ ఉక్కు సంస్థ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవటం కంటే.. ఆ సంస్థకు కాస్త అండగా నిలిచి చేయూతనిస్తే.. తప్పనిసరిగా లాభాల బాట పడుతుంది.

ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాల్ని.. తక్కువ వడ్డీ రుణాలుగా మార్చటం.. రుణాల్ని వాటాల రూపంలోకి మార్చాలనే అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. గత డిసెంబరు నుంచి 6.3 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో గరిష్ట స్థాయిలో పని చేస్తూ ప్రతి నెలా దాదాపు రూ.200 కోట్ల లాభాల్ని ఆర్జిస్తోంది. ఇదే తరహాలో మరో రెండేళ్లు పని చేస్తే.. సంస్థ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.

ప్రస్తుతం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌.. తన ఉత్పత్తి కోసం జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) కు చెందిన జైలదిల్లాలోని గనుల నుంచి మార్కెట్ ధరకు ఇనుప ఖనిజాన్ని కొనుగోలు చేస్తుంది. ఒక్కో మెట్రిక్ టన్ను ఇనుప ఖనిజాన్ని దాదాపు రూ.5260కు కొనుగోలు చేస్తోంది. దేశంలోని అన్ని ఉక్కు కర్మాగారాలకు సొంతంగా ఇనుప ఖనిజ గనులు ఉన్నాయి. వాటి ద్వారా ఆయా సంస్థల అవసరాలు 60 శాతం తీరుతున్నాయి. మిగిలిన ఇనుప ఖనిజాన్ని ఎన్ఎండీసీ నుంచి కొనుగోలు చేస్తున్నాయి.

ఈ కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై రూ.3472 కోట్లకు పైగా భారం పడుతోంది. అందువల్ల ఈ రంగంలోని మిగిలిన సంస్థలతో పోటీ పడేలా విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి. ఇది ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఒడిశాలోని ఒక ఇనుప ఖనిజం గని ఉంది. సంస్థ పునరుద్ధరణకు ఎంతో సాయం చేస్తుంది.

సంస్థకు ఉన్న రుణ భారం రూ.22వేల కోట్లు. దానికి అత్యధికంగా 14 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఈ రుణాల్ని బ్యాంకు ఈక్విటీలుగా మారిస్తే.. వడ్డీ భారం పూర్తిగా పోతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా స్టాక్ ఎక్సైంజ్ లో లిస్టు అవుతోంది. దీంతో.. మార్కెట్ ద్వారా ప్రజల నుంచి నిధుల సేకరణకు అవకాశం ఏర్పడుతుంది. పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని.. సంస్థ పునరుద్ధరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల్ని చూడగలరని ఆకాంక్షిస్తున్నా.....ఇది ప్రధాని మోడీకి జగన్ రాసిన లేఖలోని కీలకాంశాలు. ఇంతవరకూ బాగానే ఉంది.

అయితే, అసలు జగన్ లేఖను కేంద్రం లెక్క చేస్తుందా? అన్నది అసలు ప్రశ్న. ఎందుకంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేవిధంగా ఈ లేఖ లేదు....జనాలు గోల చేస్తున్నారు కాబట్టి...ఈ అంశాలు పరిగణించడం అని రిక్వెస్ట్ చేసినట్లుంది. పైగా ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రం తరపున చేసిన సూచనలు కూడా ఏమీ లేవనే చెప్పాలి. ఉక్కు ఫ్యాక్టరీ గురించి జగన్ లేఖలో రాసిన పాయింట్లన్నీ కేంద్రానికి తెలిసినవే. మరి ఈ పరిస్ధితుల్లో సీఎం రాసిన లేఖను ఎందుకు లెక్కచేస్తుంది ?

ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వరంగంలోనే ఎందుకుంచాలి, ప్రైవేటీకరించడం వల్ల నష్టాలేమిటి అన్న విషయాలను జగన్ వివరించలేకపోయారనే చెప్పాలి. ఫ్యాక్టరీలో కేంద్రం వాటాను కేంద్రానికి ఇచ్చేసి మొత్తం ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని రాష్ట్రమే సొంతం చేసుకోవటం లాంటి ప్రతిపాదనలను జనాలు ఆశిస్తున్నారు. అయితే, అవి జగన్ రాసిన లేఖలో లేవు. కానీ, స్టీలు ఫ్యాక్టరీని రాష్ట్రప్రభుత్వం నూరుశాతం సొంతం చేసుకునే అంశాలను పరిశీలిస్తోందని మంత్రి గౌతమ్ రెడ్డి చేసిన కామెంట్లపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో, ఫ్యాక్టరీని కాపాడుకునే కట్టె నలగకూడదు, పాము చావకూడదు అన్నరీతిలో ఇటు కేంద్రానికి జగన్ రిక్వెస్ట్ చేసి....అటు గౌతమ్ రెడ్డితో ప్రకటన చేయించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే జగన్ అనుమతి లేకుండా గౌతమ్ రెడ్డి ఆ ప్రకటన చేసే అవకాశమే లేదు. అలా అని డైరెక్ట్ గా జగన్ ప్రకటన చేస్తే...కేంద్రం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముంది. అందుకే, గౌతమ్ తో ప్రకటన చేయించారన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలో జగన్ లేఖపై, గౌతమ్ ప్రకటనపై...ఆల్రెడీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బేరం పెట్టాలని ఫిక్సయిన కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.