జగన్ రెడ్డీ..విశాఖలో నీ కుతంత్రాలు సాగవు: చంద్రబాబు

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించి అమ్మేస్తామంటూ కేంద్రం చేసిన ప్రకటనతో ఏపీలో నిరసనలు మిన్నంటుతోన్న సంగతి తెలిసిందే. దీంతో, ప్రజలను నమ్మించేందుకు కంటితుడుపు చర్యగా కేంద్రానికి ఏపీ సీఎం జగన్ లేఖ రాసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే, ఆల్రెడీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు జగన్ ఏనాడో అంగీకరించారని  ప్రచారం జరుగుతోంది. గత ఏడాది అక్టోబరు 29న అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలున్న దిగ్గజ స్టీల్ కంపెనీ పోక్సో ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారని, ఆ భేటీలోనే విశాఖ స్టీల్ బేరానికి డీల్ కుదిరిందన్న ప్రచారం జరుగుతోంది.

క‌డ‌ప స్టీల్ ప్లాంట్ ను పోస్కో కు అప్ప‌గిస్తార‌న్న ప్ర‌చారం చేసిన ప్రభుత్వం...తెరవెనుక విశాఖ స్టీల్ ప్లాంట్ ను పోస్కోకు అప్పగించేందుకు వ్యూహరచన చేస్తోందని గతంలోనే విమర్శలు వచ్చాయి. పోస్కోకు 2వేల ఎకరాల భూమిని ధారాదత్తం చేస్తే...విశాఖ స్టీల్ లో విస్తరణ చేపడతారని జగన్ తో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి భేటీలో డీల్ జరిగిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అప్పట్లోనే ఆ వ్యవహారంపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన చేయగా...గుట్టుచప్పుడుకాకుండా సద్దుమణిగేలా చేశారని టాక్.

ఈ వ్యవహారం అలా ఉండగానే...కేంద్రం ప్రైవేటీకరణ ప్రకటన చేసిందని, ఆ తర్వాత వ్యతిరేకత రావడంతో జగన్ యూటర్న్ తీసుకున్నారని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఏపీ ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వ‌త‌ హక్కు అని, దీనిని ప్రైవేట్ ప‌రం చేయాల‌ని చూస్తే మ‌రో ఉక్కు ఉద్య‌మం త‌ప్ప‌దని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. లక్ష‌లాది మంది ఏళ్ల త‌ర‌బ‌డి ఉద్యమించి,32 మంది ప్రాణ‌త్యాగంతో,అమ‌రావ‌తివాసి అమృత‌రావు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌తో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని సాధించుకున్నామని చంద్రబాబు గుర్తు చేశారు.

అటువంటి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని జ‌నాన్ని ఏమార్చి, తుక్కు కింద కొనేసి ల‌క్ష‌ల కోట్లు కొట్టేద్దామ‌నుకుంటున్న జ‌గ‌న్‌రెడ్డి గ్యాంగ్‌ కుతంత్రాన్ని ప్ర‌జ‌ల ‌మ‌ద్ద‌తుతో అడ్డుకుని తీరుతామని చంద్రబాబు శపథం చేశారు. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కే విశాఖ‌లో ప‌రిపాల‌నా రాజ‌ధాని అన్న జగన్మోహన్ రెడ్డీ.. ఇప్పటికే ఆ పేరుతో విశాఖ‌లో కొండ‌లు కొట్టేసి. గుట్ట‌లు మింగేసి, భూములు ఆక్ర‌మించేశారని.... ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. ప్ర‌త్య‌క్షంగా 18 వేల‌మంది శాశ్వ‌త ఉద్యోగులు, 22 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు, ప‌రోక్షంగా ల‌క్ష మందికి ఉపాధి క‌ల్పించే విశాఖ ఉక్కుని ప్రైవేట్ ప‌రం చేస్తుంటే, ఒక ముఖ్య‌మంత్రిగా నీ బాధ్య‌త ఏంటని జగన్ ను చంద్రబాబు ప్రశ్నించారు.

''నీ 31 కేసుల మాఫీ కోసం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్‌స‌భ, 6గురు రాజ్య‌స‌భ‌ స‌భ్యుల్ని కేంద్రానికి తాక‌ట్టు పెట్టేశావు. ప్ర‌త్యేక‌హోదాని బాబాయ్ హ‌త్య‌కేసుకి మార్టిగేజ్ చేశావు. ఇప్పుడు విశాఖ ఉక్కు పై స్పందించ వద్దంటూ నీ ఎంపీల నోరు కుట్టేశావు.'' అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

గతంలో స్వర్గీయ వాజ్ పాయి ప్రభుత్వంలో ఇదే పరిస్థితి వస్తే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును కాపాడింది అప్పుడు అధికారంలో ఉన్న‌ తెలుగుదేశం ప్ర‌భుత్వం అని, ఆ పని ఇప్పుడు మీరెందుకు చేయరు అని జగన్ ను చంద్రబాబు ప్రశ్నించారు. ఢిల్లీని ఢీకొడ‌తా, మోదీ మెడ‌లు వంచుతాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికే జ‌గ‌న్‌రెడ్డీ.. తన క్విడ్‌ప్రోకో దోపిడీ బుద్ధిని ప‌క్క‌న‌బెట్టాలని చంద్రబాబు హితవుపలికారు. తెలుగువారి ఉద్య‌మ‌ఫ‌లం, విశాఖ మ‌ణిహారం ఉక్కు క‌ర్మాగారాన్ని కాపాడాల్సిన బాధ్య‌త ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా జగన్ పై ఉందని గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.