మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికార కూటమి గేట్లు ఎత్తితే వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుందని గంటా అన్నారు. వైఎస్ జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, ప్రతిపక్ష నేత కాదని, మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు వస్తేనే ఆ హోదా దక్కుతుందని గంటా కామెంట్స్ చేశారు.
23 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో కొందర్ని లాగేస్తే ప్రతిపక్ష నేత హోదా పోతుందని గతంలో చంద్రబాబును జగన్ హేళన చేయలేదా? అని ప్రశ్నించారు. నైతిక విలువ కోసం మాట్లాడే అర్హతను జగన్ ఎప్పుడో కోల్పోయారని గంటా చురకలు వేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బ తిన్నాయని ఢిల్లీలో జగన్ ధర్నా చేసి అభాసుపాలు అయ్యారంటూ సెటైర్లు పేల్చారు.
అలాగే శాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గ్రేటర్ విశాఖలో జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి పదికి పది గెలవడం హర్షనీయమని.. త్వరలో జరగబోయే అన్ని ఎన్నికలకు ఇదే నాంది అని గంటా అన్నారు. ఇక త్వరలోనే విశాఖకు మెట్రో మరియు ఫ్లై ఓవర్లు రానున్నాయని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ వర్క్స్ వేగంగా సాగుతున్నాయని.. నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.