“జగనన్న వచ్చాడు.. వర్షాలు తెచ్చాడు!“ అని వైసీపీ నాయకులు గత ఏడాది ప్రచారం చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. అయితే, ఇప్పుడు మాత్రం ఇది పూర్తిగా రివర్స్ అయింది. “అన్నొచ్చాడు.. వరద తెచ్చాడు.. మమ్మల్ని ముంచాడు!“ అని దాదాపు ఆరు నుంచి ఏడు జిల్లాల అన్నదాతలు లబోదిబోమంటున్నారు. సకాలంలో వర్షాలు రావడం వేరు..కానీ, ఇప్పుడు వచ్చిన వర్షాలతో మంచి ఉత్పత్తి దశలో ఉన్న అన్ని పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. అదేసమయంలో ఉద్యానవన పంటలు నీట మునిగాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతులకు కోలుకోలేని విధంగా ఈ వర్షాలు, వరదలు దెబ్బకొట్టాయి.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వాన చినుకులు కురిసినా.. ఆ క్రెడిట్‌ను సీఎం జగన్ ఖాతాలోకి మళ్లించేందుకు వైసీపీ నేతలు చేయని ప్రయత్నం లేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఏ ఒక్కరూ మాట్లాడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా.. కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిశాయి. అదేసమయంలో ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో పోటెత్తిన వరదలుఏపీపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఒక్క కృష్ణా జిల్లాలోనే 23వేల హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, 6,164 హెక్టార్లలో ఉద్యానపంటలు వరద బీభత్సానికి తుడిచి పెట్టుకుపోయాయి.
తూర్పు గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు ఎన్నడూ చవిచూడని నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. పిల్ల పెరిగి పెద్దదవుతున్న దశకు చేప, రొయ్య చేరిన సమయంలో వరద ముంచెత్తడంతో ఉత్పత్తి కొట్టుకుపోయింది. జిల్లాలో సుమారు 52 వేల ఎకరాల్లో ఆక్వా సాగు తుడిచి పెట్టుకుపోయింది. గడిచిన ఆరు నెలలుగా రైతులు పడిన కష్టం వరదకు కొట్టుకుపోవడంతో వారంతా లబోదిబోమంటున్నారు. ఇక, గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో సుమారు 1300 ఎకరాలలో వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం జరిగింది. సుమారు 420 ఎకరాల్లో ఆక్వా చెరువులు దెబ్బతిన్నాయి. ఇలా దాదాపు ఆరు నుంచి ఏడు జిల్లాల్లో వరదలు, వర్షాలు బీభత్సం సృష్టించాయి.
అయితే, వర్షాలను తమ క్రెడిట్ లో వేసుకుని, రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించే వైసీపీ నాయకులు.. ఈ సారి మాత్రం నోటికి తాళాలు వేసుకున్నారని, ఎక్కడ నోరు విప్పితే.. వ్యతిరేకత వస్తుందోనని వారు భయపడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక, చిత్రం ఏంటంటే.. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న నాయకులు కూడా పర్యటించలేదు. అదేమని అండిగితే.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తమకు ఆదేశాలు లేవని వెల్లడించడం గమనార్హం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఓ నలుగురు మంత్రులు మాత్రం బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.
అయితే బాధితులకు.. భరోసా ఇస్తున్నా.. ఇప్పటి వరకు ప్రజలకు అందించిన సాయం మాత్రం కనిపించడం లేదు. ఇదిలావుంటే.. గత ఏడాది వచ్చిన వరదలతో నష్టపోయిన రైతులకు రూ.6 వేల చొప్పున సాయం చేస్తామని హామీ ఇచ్చిన జగన్.. ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నదాతలు ఆరోపిస్తుండడం కొసమెరుపు. ఏదేమైనా.. వర్షాలను కూడా రాజకీయంగా వాడుకున్న వైసీపీ నెత్తిన వరదలు పెద్ద బండనే పడేశాయని అంటున్నారు పరిశీలకులు. ఏదైనా అతి చేయడం మంచిదికాదని, అప్పట్లో జగన్ అధికారంలోకి వచ్చాడు కాబట్టే రాష్ట్రంలో వర్షాలు కురిసి.. సుభిక్షంగా ఉన్న నేతలు.. ఇప్పుడు వచ్చిన వరదలకు కూడా జగనే కారణమని అంటే .. ఒప్పుకొంటారా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి.