ఇటీవల కురిసిన వర్షాలకు, వరదలకు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ వరదల వల్ల వేల కోట్లు రూపాయల ఆస్తి, పంట నష్టం జరగగా…ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 62 మంది మరణించారు. ఇక, ఇంత జరుగుతున్నా…సొంత జిల్లాలో జనం కొట్టుకుపోతున్న జగన్ కు పట్టలేదని విమర్శలు వెల్లువెత్తాయి. హెలికాప్టర్ లో జగన్ ఏరియల్ సర్వే చేసి చేతులు దులుపుకుంటే వరద బాధితుల కష్టాలు ఏం తెలుస్తాయని విమర్శలు వచ్చాయి.
కానీ, జగన్ మాత్రం లీడర్ అనేవాడు డ్రామాలు చేయకూడదని, నిజంగా వరదబాధితులకు సాయం అందేలా చూడాలని అసెంబ్లీలో గర్వంగా ప్రకటించేసుకున్నారు. అంతేకాదు, జనానికి మంచి జరుగుతోందా లేదా….బాధితులందరికీ మిస్ కాకుండా సహాయం జరుగుతోందా లేదా అన్నది మాత్రమే ముఖ్యమని జగన్ తేల్చేశారు.ఈ క్రమంలోనే జగన్ అసెంబ్లీలో చెప్పిన మాటలకు, జనం పడుతున్న బాధలకు పొంతనే లేదు. దీంతో, జగన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
పైన హెలికాప్టర్ లోతిరిగితే కింద ఉండే పూరిళ్లు, రేకుల ఇళ్లు ముఖ్యమంత్రికి కనబడవని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అధికారులు పట్టించుకోలేదని, తమ వీధిలో మూడంతస్తుల బిల్డింగ్ కూలిపోబోతున్న చోద్యం చూశారని అంటున్నారు. అధికారులంతా చదువుకున్నవారే కదా …ఆ బిల్డింగ్ పక్క ఇళ్ల మీద పడితే ఏం చేయాలతో కూలి నాలీ చేసుకునే తమకేం తెలుసని ప్రశ్నిస్తున్నారు.
తాము వరదల్లో సర్వం కోల్పోయామని, కట్టుబట్టలతో బయటకు వచ్చామని అంటున్నారు. తమ వారు ప్రాణాలు కోల్పోయారని, తాము చచ్చి బ్రతికామని కన్నీటి పర్యంతమవుతున్నారు. తమను ఆదుకోవాల్సిన సీఎం మాత్రం పైపైన పరామర్శించి వెళుతున్నారని, తమను ఆదుకోవాలని అంటున్నారు.