ఏపీలో తాను అభివృద్ధి పనులు చేస్తుంటే.. నలుగురు కలిసి తనపైనా, తన ప్రభుత్వంపైనా..కుట్రలు పన్నుతున్నారని.. లేనిపోని వ్యాఖ్యలు చేసి.. ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని.. ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాదు.. దుష్టచతుష్టయం.. అంటూ.. ఆయన పదేపదే వ్యాఖ్యానించారు. తాను రాష్ట్రంలో పేదలకు.. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నానని.. రాష్ట్రాన్ని అబివృద్ది పథంలో తీసుకువెళ్తున్నానని.. కానీ, ఈ దుష్ట చతుష్టయం ఏమీ అభివృద్ధి జరగడం లేదని.. అప్పులు చేస్తున్నారని.. తీవ్ర వ్యతిరేక ప్రచారం చేస్తోందని.. మండిపడ్డారు.
సరే! అదే నిజమని అనుకున్నా.. ఇప్పుడు పొరుగునే ఉన్న తెలంగాణ కూడా ఏపీపై నిప్పులు చెరిగింది. మరీ ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ కు సన్నిహితుడు, మిత్రుడు, క్లాస్ మేట్ కూడా అయిన.. మంత్రి కేటీఆర్ ఏపీపై విమర్శల తుఫానుతో రెచ్చిపోయారు.
రోడ్లు బాగోలేవని.. గుక్కెడు నీళ్లు కూడా లేవని… విద్యుత్ కోతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని.. దాదాపు పల్లెలు అన్నీ కూడా.. అంధకారంలో చిక్కుకున్నాయని.. ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. ఇక్కడితో కేటీఆర్ ఆగిపోలేదు. రుజువులు సాక్ష్యాలు అంటూ.. మరీ రెచ్చిపోయారు. తన మిత్రులు చెప్పారని అన్నారు. అవసరం అయితే.. తన మాటపై నమ్మకం లేకపోతే.. ఒక్కసారి.. ఏపీలోని ఏప్రాంతానికైనా వెళ్లండి.. అని పిలుపునిచ్చారు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయం ఉందా.. సెంటిమెంటు ఉందా? అనే విషయాలకన్నా.. జగన్ చెబుతున్న దుష్టచ తుష్టయం మాటల్లో ఎంత విశ్వసనీయత ఉందనేది ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ప్రధాన చర్చ. ఎలాగంటే.. జగన్ అంటే గిట్టక .. చంద్రబాబు అధికారంలోకి రావాలని తపిస్తున్నవారే.. తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని కదా.. జగన్ చెబుతున్నారు. మరి ఇప్పడు ఆయన సన్నిహితుడు. ఇద్దరూ కలిసి.. అనేక సందర్భాల్లో వేదికలు సైతం పంచుకున్నారు.
ఏపీలో ఎలాంటి ప్రయోజనాలు ఆశించని నాయకుడే ఏపీని దిగంబరంగా నిలబెట్టేశాడు కదా..? మరి దీనిని ఏమంటారు? అని జగన్‌కు సర్వత్రా ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఏపీలో నిజంగానే అబివృద్ధి జరిగితే.. పొరుగున ఉన్న రాష్ట్రాలు ఎందుకు మాట్లాడతాయి ? పోనీ.. ఇలా మాట్లాడినా.. అవి నిజాలు కావని.. మా ప్రభుత్వంలో రోడ్లు అద్దంలా మెరిసిపోతున్నాయని.. విద్యుత్ నిరంతరాయంగా ప్రవహిస్తోందని.. చెప్పుకునే రుజువులు ఉన్నాయా ? అంటే.. వైసీపీ సర్కారు వద్ద.. అవి లేవు. మరి ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు చేస్తే.. దుష్టచతుష్టమయని అన్నారు జగన్. జగన్‌లో ఎందుకో ఈ కంగారు అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
ఇప్పుడు కేటీఆర్ అంటే.. ఆయనను కూడా ఈ మూకలో కలుపుతారా? లేక.. ఏం చేస్తారు? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న, ఏదేమైనా.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇటీవల కాలంలో జరుగుతున్న అంతర్యుద్ధాలకు ఇది పరాకాష్టగా మారిందని అంటున్నారు పరిశీలకులు. దీనిపై జగన్ జోక్యం చేసుకుంటారా? మౌనంగా ఉంటారా? చూడాలి. గతంలో తన తండ్రిని దుర్మార్గుడు, రాక్షసుడు అని అన్నప్పుడే.. ఆయన మౌనం పాటించారు. మరి ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని తిట్టినా.. అదే మౌనం పాటిస్తారేమో చూడాలి.