రైతాంగ ఉద్యమం నుండి పొందిన ఉద్యమ స్ఫూర్తితో చలిలో హైవే పై నిద్రకు మా బృందం నిర్ణయం.

రైతాంగ ఉద్యమం నుండి పొందిన ఉద్యమ స్ఫూర్తితో చలిలో హైవే పై నిద్రకు మా బృందం నిర్ణయం.
ప్రియమైన మిత్రులారా!
 ఊరుకూ ఊరుకూ మధ్య బండి బాటలు ఉంటాయి. రైతు పొలానికీ రైతు పొలానికీ మధ్య కాలిబాటలు ఉంటాయి. చేనుకూ చెలకలకూ మధ్య డొంక దారులు ఉంటాయి. ఊరుకూ పట్నం సంతలకూ మధ్య తారు రోడ్లు ఉంటాయి. ఈ ఆఖరి తారు రోడ్ల మీద తాము ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యంతో ఏడాదికి ఒకసారో రెండు సార్లో మార్కెట్ కోసం రైతు పట్నం వెళతాడు. అది తప్ప ఏడాది పొడవునా తన జీవితమంతా రైతుల నడక ప్రధానంగా బండి బాటలు, కాలిబాటలు, డొంక మార్గాల గుండా సాగడం సహజం. అలా నడిచే రైతులు నేడు నేషనల్ హైవే ఎక్కి, దాన్ని ఏకంగా తమ నివాసంగా కూడా మార్చారు. ఇది భారతదేశ రైతు చేస్తోన్న కొత్త ప్రయోగం.
.
జాతీయ రహదారుల మీద భారతదేశ రైతాంగం కొత్తగా ఇలా నివాసం ఏర్పరుచు కోవడం వర్తమాన దేశ చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి  కావచ్చు. ఇది కూడా ఒకటి లేదా రెండు రోజులు కాదు. ఏకంగా నేటికి మూడు వారాలుగా సాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీకి చేరే పలు హైవేల్ని దిగ్బంధించి, వాటిని తమ స్వంత నివాసాలుగా రైతాంగం మార్చుకోవడం అపూర్వమైనది. రాజ్యం దృష్టి లో స్వర్ణ భుజిగా పేరొందిన హైవేలను దిగ్బంధించి తమ స్వాధీనంలో ఉంచడం ఒక ఎత్తు. వాటి మీద రైతులు తమ స్వంత ఇష్టం ప్రకారం వంట గదులు (కిచెన్ రూమ్స్), భోజన శాలలు (డైనింగ్ రూమ్స్), పడక గదులు (బెడ్ రూమ్స్) సభా, సమావేశ వేదికలు (కాన్ఫెరెన్సు హాల్స్), రచ్చ బండలు (పబ్లిక్ క్లబ్స్) నిర్మాణం చేసుకోవడం మరో ఎత్తు! స్వర్ణభుజి పై పది నిమిషాలు రాస్తా రోకో జరిగితే అల్లడిపోయే రాజ్యం నేడు మౌనమూర్తిగా మారింది. ఐనా  రైతుల కొత్త నివాసాల్ని కూడా రాజ్యం చూస్తూ గుడ్లప్పగించి మౌనంగా తిలకిస్తోంది. ఇలా రైతాంగపు కొత్త నివాసాల నిర్మాణాలతో స్తంభించిన హైవేలలో ఒక హైవే పై ఈ రాత్రికి మేము బస చేస్తున్నాం. ఈ అపూర్వ, అసాధారణ అనుభవం నుండి పొందే మా రాజకీయ మధురానుభూతిని మిత్రులతో పంచుకునే చిన్న ప్రయత్నమిది.
    ఇది బహుశా షేర్ షా పాలనా కాలంలో భారత ఉప ఖండంలో నిర్మాణమైన గ్రాండ్ ట్రంక్ రోడ్డు కావచ్చునేమో! ఔనుమరి, చరిత్రలో చదివినట్లు కలకత్తా నుండి పెషావర్ వరకు నిర్మాణం చేసిన నాటి రోడ్డు ఇదే కావచ్చని అనిపిస్తుంది. అదే నిజమైతే, నేటి ఆధునిక రాజ్య స్వర్ణభుజి రహదారిగా అదే మారినట్లు భావించాలి. అదే కావచ్చు, కాకపోవచ్చు. అది ఏదయినా నేటి స్వర్ణభుజి తరహా రహదారే. దానిని నేటి భారత రైతాంగం తమ స్వంత నివాసంగా మార్చింది. ఇలా  రైతులు కొత్తగా నిర్మించుకున్న నివాసాలలోనే ఈ రాత్రి గడ్డకట్టే చలిలో మా బృందం కూడా బస చేయాలని ఇంతకుముందే నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడే ఒక బెడ్ రూమ్ లోకి చేరి బసకి ఉపక్రమిస్తున్నాం. ఈ సరి కొత్త నివాసాలకు ఇంకా విద్యుత్ సౌకర్యం సమకూరలేదు. ఐనా గృహ ప్రవేశం జరిగింది. కరంటు లేక పోవడం వల్ల త్వరగా పడుకోక తప్పడం లేదు. నిద్రకు ఉపక్రమిస్తూ మిత్రులకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాము. 

 కొన్ని లాటిన్ అమెరికా దేశాలకు చెందిన కొన్ని పెద్ద నగరాలను రైతాంగం రోజుల తరబడి ముట్టడి చేసిన వార్తల్ని గతంలో విన్నాం. ఆచరణలో అదెలా సాద్యమైనదో మనకు అర్ధం అయ్యేది కాదు. అట్టి అపురూప దృశ్యాలను నేడు భారతదేశ రైతాంగం మన కళ్ళ ఎదుట పునరావిష్కరణ చేస్తోంది. అలాంటి చోట నేడు మా పర్యటన సాగింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి రోజంతా ఇక్కడ రైతాంగపు ముట్టడి దృశ్యాల్ని చూసాం. సుమారు పది గంటల పాటు విరామం లేకుండా తిరుగుతూ పరిశీలిస్తూనే ఉన్నాము. మా బృందం సభ్యులు నిజానికి వయస్సు రీత్యా గానీ, ఆరోగ్యం రీత్యా గానీ పూర్తిస్థాయిలో తిరగలేని స్థితిలో ఉన్నవాళ్ళం. ఐనా అలసటకు గురి కాలేదు. అది రైతాంగ పోరాటం నుండి పొందిన స్పూర్తి వల్ల కాబోలు!

 పై స్ఫూర్తి మాకు మరో కొత్త సంకల్పానికి కూడా కారణంగా మారింది. ఎక్కడి నుండో ఇక్కడి పోరాట దృశ్యాల్ని చూడటానికి వచ్చి, ఈ రైతుల నివాసాల్ని వదిలి బస కోసం ఢిల్లీ ఎందుకు వెళ్ళాలి? ఇది మమ్మల్ని వేధించిన ప్రశ్న. మా నిర్ణయం మారింది. ఇక్కడ పంజాబ్ AIKMS కామ్రడ్స్ కలిశారు. మా నిర్ణయం వారికి చెప్పాము. వెంటనే సంతోషంగా వారు స్వాగతం పలికారు. సింఘు బోర్డర్ లో హైవే పై తాము బస చేసే చోట మాకు కూడా సాదరంగా చోటు కల్పించారు. పైగా తమ దగ్గర ఉన్న చలి దుప్పట్లు కూడా ఎంతో సహృదయత ఇచ్చారు. బస చేస్తున్నాం. ఈ క్షణంలో మాకు ఎంత ఆనందంగా వుందో తెలుసా మిత్రులారా? బండి బాటలు, కాలిబాటలు, డొంక దారుల్లో తిరుగుతూ, చెట్టుకి పుట్టేడు నీళ్లు పెట్టి, తమ కాయకష్టంతో పంటలు పండించి, ఆ పంట పొలాలలో చలి రాత్రుల్లో సైతం బస చేసే రైతాంగం నేడు ఆధునిక రాజ్యానికి ప్రాణ వాయువు వంటి స్వర్ణభుజి హైవేలను దిగ్బంధించారు. పైగా, వాటిని తమ స్వాధీనంలో ఉంచుకొని వాటి మీద నిర్మించిన తమ నివాసాలలో వాళ్ళ చెంతనే ఒక్క రాత్రైనా సరే బస చేసే అవకాశం కల్పించారు. ఈ వేళ మేము పొందే ఆనందం, పరమానందం మాది మాత్రమే కాదు. మన అందరిదీ. మరి ఈ సంతోషకరమైన వార్త విని మన మిత్రులు కూడా మా ఆనందం లో భాగస్వాములు అవుతారు కదూ! మళ్లీ రేపు ఉదయం కలుద్దాం. 
✍ ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
9PM, 16-12-2020,
FROM, సింఘు బోర్డర్,
రైతుల బస స్థలం,
NEAR ఢిల్లీ.
ఢిల్లీ ముట్టడి కధనం-2
గమనిక:--అచ్చు పొరపాట్లు పట్టించు కోవద్దని మనవి. వెలుతురు లేదు, చలి దంచి వేస్తోంది. ఫోన్ లో ఛార్జింగ్ లేదు. త్వరగా మిత్రులకు పంపే ఆతురత వల్ల అట్టి దిద్దుబాట్లు చేయకుండా పంపిస్తున్నది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.