దాదాపు ఏడున్నర దశాబ్దాల క్రింద అహింసా సిద్ధాంతమే ఆయుధంగా తెల్లదొరల మెడలు వంచిన బాపూజీ ఆగస్టు 15, 1947న భరతమాతకు బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింస అనే ఆయుధంతోనే నేల కూల్చారు. భారత దేశ స్వతంత్ర్య పోరాటాన్ని ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించారు. ఆ రకంగా స్వాతంత్ర్యం సాధించుకున్న మన దేశం జనవరి 26న పూర్తి స్వేచ్ఛతో గణతంత్ర రాజ్యంగా మారింది. జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో ప్రతి ఏటా జనవరి 26న ఘనంగా రిపబ్లిక్ డేను నిర్వహించుకుంటున్నాం. భారత దేశ గణతంత్ర వేడుకలను ప్రపంచమంతా ఆసక్తిగా తిలకిస్తుంటుంది. ఎర్రకోటపై దేశ ప్రధాని జాతీయ జెండాను గర్వంగా ఎగురవేసే శుభదినాన్ని దేశ ప్రజలంతా పండుగలా జరుపుకుంటారు. అయితే, అహింసే పరమావధిగా రూపుదిద్దుకున్న భారతావనిలో నేడు జరిగిన 72వ గణతంత్ర దినోత్సవం చరిత్రలో ఓ చీకటి రోజుగా మిగిలిపోనుంది. దేశ చరిత్రలో ఈ రిపబ్లిక్ డే..ఒక బ్లాక్ డేగా మిగిలిపోనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటను రైతులు చుట్టుముట్టి అక్కడ రెండోసారి జాతీయ జెండాను ఎగురవేసిన ఘటన పెను దుమారం రేపుతోంది.
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ‘ కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ’ హింసాత్మకంగా మారింది. ఢిల్లీ వీధుల్లో భారీ సంఖ్యలో ట్రాక్టర్లపై దూసుకువచ్చిన రైతులు…ఒక్కసారిగా ఎర్రకోటను చుట్టుముట్టారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎర్రకోట బురుజుల పైకి చేరిన రైతులు..అక్కడి ఫ్లాగ్ పోల్‌పై జెండాలు ఎగురవేశారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించిన చోటే….రైతులు మరోసారి జెండా ఎగురవేశారు. దీంతో, దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రెండోసారి జెండా ఎగురవేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిరసన తెలపడంలో తప్పులేదని, కానీ,దేశప్రధానికి, జాతీయ జెండాకు అవమానం కలిగించేలా ప్రవర్తించడం ఏమిటని రైతుల తీరును పలువురు తప్పుబడుతున్నారు.
అంతకుముందు ఢిల్లీ ఐటీవో వద్ద పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన ఘర్షణలోనూ కొందరు రైతులు తల్వార్ లతో పోలీసులపై దాడి చేసినట్టు చెబుతున్నారు. పోలీసులు ఆపుతున్నప్పటికీ తమకు నిర్దేశించిన మార్గంలో కాకుండా రైతు నిరసనకారులు వేరే మార్గంలో ఎర్రకోటకు చేరి జెండా ఎగురవేయడంపై విమర్శలు వస్తున్నాయి. శాంతియుతంగా నిరసన అంటూ ఈరకంగా హింసాత్మక ఘటనలకు పాల్పడడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.