టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావును టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సస్పెండ్ చేశారని ఫేక్ న్యూస్ ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ వ్యవహారం నేపథ్యంలో తన పేరు కూడా వినిపిస్తోందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేసినట్లు, తన ఇంటిపేరు కూడా గోరంట్ల కావడంతో ఇకపై టీడీపీ కార్యకర్తలు ఈ వ్యవహారంపై పోస్టులు పెట్టకూడదంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరుతో ఒక ఫేక్ ట్వీట్ కూడా తెగ చక్కర్లు కొట్టింది.
ఇలా, ఈ మధ్యకాలంలో టీడీపీ నేతల పేరుతో ఫేక్ న్యూస్ లు ప్రచారంలో ఉంటున్నాయి. ఈ క్రమంలోనే, తాజాగా మరో ఇద్దరు టీడీపీ నేతల పేరుతో ఫేక్ న్యూస్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, చింతమనేని ప్రభాకర్ ల పేరుతో సర్వే నిర్వహించారంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జగన్ రాక్షస పాలనను అంతం చేసేందుకు జనసేనకు 15 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు కూడా ఆఫర్ చేసేందుకు చంద్రబాబు సిద్ధం అంటూ కూన రవికుమార్ వ్యాఖ్యలు చేశారనేది ఆ పోస్ట్ సారాంశం. పవన్ కు చంద్రబాబు ఇచ్చే ఆఫర్ ఇదే అంటూ ఆ పోస్ట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఇక, కూన రవికుమార్ వ్యాఖ్యలను టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా సమర్థించినట్లుగా మరో పోస్ట్ బయటకు వచ్చింది.
అంతేకాదు, తాను చేయించిన సర్వేలో జనసేన 15, బీజేపీ 4 ఎమ్మెల్యే స్థానాల్లో బలంగా ఉన్నాయని, కాబట్టి ఎవరి బలాన్ని బట్టి వాళ్ళు పోటీ చేస్తే ఫలితాలు వస్తాయని చింతమనేని చెప్పినట్లుగా మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ రెండు పోస్టులు ఫేక్ అని టీడీపీ ఫ్యాక్ట్ చెక్ తన అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అధికంగా ప్రకటించింది. ఇక, తమ పేర్లతో వచ్చిన ఆ పోస్టులు ఫేక్ అని కూన రవికుమార్, చింతమనేని ప్రభాకర్ కూడా క్లారిటీ ఇచ్చారు. వాటిని నమ్మొద్దని వారు కోరారు.