ఇల్లు ఏదైనా నెల తిరిగేసరికి కొనే నిత్యవసర వస్తువుల్లో తప్పనిసరిగా ఉండే వస్తువుల్లో వంట నూనె ఒకటి. పేదవాడు పామాయిల్ వాడితే.. మధ్యతరగతి జీవి సన్ ఫ్లవర్ అయిల్ వాడుతుంటారు. ఉండేందుకు చాలానే ఉన్నా.. ఎక్కువగా వాడేది మాత్రం పామాయిల్. ఏడాది క్రితం లీటరు పామాయిల్ ధరకు.. ఇప్పటికి ఏకంగా ధర డబుల్ కావటం గమనార్హం. గత ఏడాది లీటరు పామాయిల్ రూ.80-90 మధ్య ఉంటే.. ఇప్పుడు ఏకంగా రూ.140-150కు చేరుకుంది.
ఆ మాటకు వస్తే సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా తక్కువేం తినలేదు. గత ఏడాది లీటరు సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.వంద ఉంటే.. ఇప్పుడు రూ.175కు చేరుకుంది. అంటే దాదాపు 70 శాతం ధర పెరిగిందన్న మాట. నూనెల ధరలు ఎందుకింతలా కాగిపోతున్నాయి. దాని వెనుకున్న కారణం ఏమిటి? అన్నదిప్పుడున్న ప్రశ్న. వ్యాపార.. వాణిజ్య వర్గాలకు చెందిన వారు చెబుతున్న దాని ప్రకారం చూస్తే..మనం వినియోగించే పామాయిల్.. సన్ ఫ్లవర్ ఆయిల్లో అత్యధికం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. షిప్పుల ద్వారా తెప్పించి.. దాన్ని శుద్ధి చేసి ప్యాకెట్లుగా మార్చి అమ్మేస్తుంటారు.
పామాయిల్ ను ఎక్కువగా ఇండోనేషియా.. మలేసియా నుంచి వస్తుంటే.. సన్ ఫ్లవర్ ఆయిల్ బ్రెజిల్.. ఉక్రెయిన్.. రష్యా.. అర్జెంటీనాల నుంచి దిగుమతి చేసుకుంటాం. కరోనాతో చోటు చేసుకున్న పరిణామాలు.. పంట ఉత్పత్తి తక్కువ కావటంతో అంతర్జాతీయంగా వంట నూనె ధరలు పెరిగాయి. దాంతో పాటు.. వంట నూనెల మీద కేంద్రం విధించే దిగుమతి సుంకం కూడా ధర భారీగా ఉండటానికి కారణమవుతుందని చెబుతున్నారు.
వ్యాపార వర్గాల లెక్కల ప్రకారం చూస్తే.. వంట నూనెల దిగుమతి మీద దిగుమతి సుంకం ఏకంగా 35 శాతం ఉందని చెబుతున్నారు. దీనికి అదనంగా మరో 5 శాతం (దగ్గర దగ్గరగా) సెస్.. ఇది సరిపోనట్లుగా జీఎస్టీ 5 శాతం ఉంటుందట. అంటే.. రేటులో 45 శాతం పన్నుపోటుకే పోతుందన్న మాట. ఇది కాకుండా.. విదేశాల నుంచి పోర్టులకు చేరే నూనెల్ని కంపెనీకి చేర్చేందుకు అయ్యే రవాణా ఖర్చులు.. కంపెనీ నుంచి సీ అండ్ ఎఫ్ (క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ (రాష్ట్రానికి ఒకరు చొప్పున ప్రతి కంపెనీకి ఉంటారు).. తర్వాత నగరానికి ఒకరు చొప్పున ఉండే సూపర్ స్టాకిస్టు.. ప్రాంతానికి ఒకరుగా ఉంటే స్టాక్టిస్టు.. తర్వాతి దశలో ఉండే హోల్ సేలర్.. చివరకు మనం కొనే కిరాణా షాపు (రిటైల్ వ్యాపారస్తుడు) వెరసి.. ఒక్కో దశలో కనిష్ఠంగా 2 శాతం.. గరిష్ఠంగా 5 శాతం వరకు కమీషన్ ఉంటాయి.
ఈ లెక్కన చూస్తే దగ్గర దగ్గర 15-20 శాతం వరకు వ్యాపారి లాభం.. ప్రభుత్వం విధించే సుంకం.. పన్ను పోటు.. రవాణా ఛార్జీలు మొత్తంగా చూస్తే.. కేజీ నూనెకు మనం చెల్లించే ధరలో దగ్గర దగ్గర 60-70 శాతం వరకు ఉంటాయి. అంటే ఇవాల్టి రోజున మనం సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.175కు కొంటుంటే.. అందులో రూ.100 – 110 వరకు ఇవే సరిపోతుంది.
వంటనూనె ధర తక్కువగా ఉన్నప్పుడు కేంద్రం విధించే సుంకాలు.. పన్నులు.. రవాణా ఛార్జీలు పెద్దగా అనిపించవు. కానీ.. ధరలు పెరిగినప్పుడు కూడా పాత పద్దతిలోనే కొనసాగే పన్ను సామాన్యులకు భారంగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు వీటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే గుర్తించి.. సామాన్యుల బడ్జెట్ మీద భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాడ్ లక్ ఏమంటే ప్రభుత్వాలకు ప్రజలు పడే ఈతి బాధలు పట్టవు కదా? ఇప్పుడు అర్థమైందా.. మనం కొనే వంట నూనెకు పన్నుల రూపంలో మనం చెల్లించే మొత్తం ఎంతో?