ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని మోడీ చేసిన కామెంట్లు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. విభజన జరిగిన 8 ఏళ్ల తర్వాత మోడీ తేనెతుట్టె వంటి అంశాన్ని లేవనెత్తడంతో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జగన్ నోరుమెదపకపోవడం అన్యాయమని ఆయన ఫైర్ అయ్యారు.
ఆ విషయంపై లోక్సభలో వైసీపీలతో చర్చ పెట్టించాలని, విభజనపై ఇప్పటికైనా ఏపీకి సంబంధించిన నేతలు స్పందించాలని ఉండవల్లి హితవు పలికారు. ఒక మెయిల్ ఏర్పాటు చేసి ఏపీ విభజనపై ప్రజల అభిప్రాయాలు సేకరించాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం జనగ్ ప్రయత్నించరా అని ప్రశ్నించారు. ఏపీ విభజనపై కేసీఆర్కు కోపమెందుకని ఉండవల్లి ప్రశ్నించారు.
ఏపీకి జరిగిన అన్యాయంపై కేసీఆర్ మాట్లాడాలని, బీజేపీని నిలదీసేందుకు ఏపీని కలుపుకోవాలని హితవు పలికారు. ఏపీ విభజన నిబంధనల ప్రకారం జరిగిందని కేసీఆర్ ఒప్పుకుంటారా అని ఉండవల్లి నిలదీశారు. 2013లోనే విభజనపై సుప్రీంకోర్టులో ఫిటీషన్ దాఖలు చేశానని, మళ్ళీ సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది అల్లంకి రమేష్ ద్వారా అర్జెంట్ పిటీషన్ దాఖలు చేశానని అన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పందించి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు.