వాయువేగంతో కారు నడుపుతూ.. ప్రజాభవన్ వద్ద నిలిపిన బారికేడ్లను ఢీ కొన్న ఉదంతంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ఉన్నట్లుగా తేలటం తెలిసిందే. ఈ ప్రమాదంలో అతగాడు ఉన్నప్పటికీ.. తనకున్న పలుకుబడితో ఇంట్లో పని చేసే వ్యక్తిని ప్రమాదం జరిగిన సమయంలో కారును డ్రైవ్ చేస్తున్నట్లుగా కలర్ ఇవ్వటం..తాను ఆ కేసు నుంచి తప్పుకోవటం కోసం పంజాగుట్ట సీఐ సాయాన్ని తీసుకోవటం తెలసిందే.
కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలో పంజాగుట్ట సీఐ ఘనకార్యం బయటకువచ్చి అతడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. రోడ్డు ప్రమాదం నుంచి జంప్ అయిన మాజీ ఎమ్మెల్యే కొడుకు సాహిల్ దేశం దాటేసినట్లుగా చెబుతున్నారు. అతడి గురించి పోలీసులు వెతుకుతున్న నేపథ్యంలో అతడు దుబాయ్ వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. రోడ్డు ప్రమాద ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ఆచూకీ కోసం తాజాగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
దేశం విడిచి వెళ్లిపోయిన సాహిల్ ను తిరిగి హైదరాబాద్ కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 23 అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కొడుకును కేసు నుంచి తప్పించటానికి రూ.20-25 లక్షలు చేతులు మారినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఆ డబ్బుల్ని పంచుకోవటంలో వచ్చిన తేడాతోనే ఈ విషయం బయటకు పొక్కినట్లుగా ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు వర్గాలు అంతర్గత విచారణను నిర్వహిస్తున్నాయి.