బెల్లం చుట్టూ ఈగలు…అధికార పార్టీ చుట్టూ నేతలు నేతలు అన్న చందంగా తయారయ్యారు ఈ తరం రాజకీయ నాయకులు. అధికారం ఉన్నంత సేపు ఆ పార్టీకి వీర విధేయులుగా ఉన్న వారు సైతం…అధికార పార్టీ ఓటమి పాలైన మరు నిమిషమే పార్టీ మారేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. ఈ క్రమంలోనే ఏపీలో ఘోర పరాజయం పాలైన వైసీపీని ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా వీడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆళ్ల నాని ఆ జాబితాలో చేరారు. వైసీపీకి గుడ్ బై చెప్పానని ఆళ్ల నాని సంచలన ప్రకటన చేశారు.
ఇటీవల తన పదవులకు రాజీనామా చేశానని, కానీ, ఇప్పుడు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానని ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేశానని అన్నారు. ఇక, ఏలూరులో వైసీపీ కార్యాలయం ఖాళీ చేయడంపై కూడా నాని స్పందించారు. ఆ ఆఫీసు ఉన్న భవనం లీజు గడువు ముగిసిందని, అందుకే ఖాళీ చేశామని అన్నారు. ఇక, అక్కడ వైసీపీ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన షెడ్లను కూల్చివేశామని చెప్పారు. అయితే, ఆ స్థలం యజమాని అనుమతితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అక్కడే జరిపామని, ఆ తర్వాత షెడ్లు తొలగించి స్థలాన్ని అప్పగించామని స్పష్టం చేశారు. ఆళ్ల నాని వంటి సీనియర్ నాయకుడు పార్టీకి రాజీనామా చేయడంతో వైసీపీకి గట్టి షాక్ తగిలినట్లయింది. త్వరలోనే నాని జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది.