ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే కొందరు బీఆర్ఎస్ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. ఈ నెల 10వ తేదీన రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను రాజయ్యకు కేటాయించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాకరించారు. రాజయ్యతో అంతర్గత విభేదాలున్న కడియం శ్రీహరికి ఆ టికెట్ ఇచ్చారు. ఆనాటి నుంచే తీవ్ర అసహనంతో ఉన్న రాజయ్య తన అనుచరులతో చర్చించి తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో రాజయ్య కొద్ది రోజుల క్రితం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సమక్షంలో రాజయ్య త్వరలోనే కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీలో తాను అసంతృప్తితో ఉన్నానని, పార్టీకి ఎంతో సేవ చేసినా తనకు సరైన గుర్తింపు రాలేదని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లో ఆత్మ క్షోభకు గురయ్యానని, పార్టీ అధినేతను కలవాలని చూసినా తనకు ఆ అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.