మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (89) కన్నుమూశారు. కొంతకాలంగా రోషయ్య అనారోగ్యంతో బాధపతున్నారు. ఈ రోజు తెల్లవారు జామున ఉన్నట్లుండి ఆయన లో-బీపీతో అకస్మాత్తుగా పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయం బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రిలో ఉంచారు.
రోశయ్య 4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో రోశయ్య విద్యాభ్యాసం కొనసాగించారు. రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి. రంగా శిష్యులు. నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయంలో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కాంగ్రెసు పార్టీ తరపున 1968,1974,1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. మొదటిసారిగా 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు నిర్వహించారు.
అలాగే 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖా మంత్రిగా పనిచేశారు. 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు.
2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. రోషయ్య మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రోషయ్యతో ఉన్న అనుబంధాన్ని నేతలు గుర్తుచేసుకుంటున్నారు.