ఉగాది రోజున అన్ని రాష్ట్రాల ప్రజలు షడ్రుచులు చవిచూస్తే…జగన్ దయ వల్ల ఏపీ ప్రజలు మాత్రం చేదు రుచిని మాత్రమే చవిచూడాల్సి వచ్చింది. ఏపీలో గత 22 నెలల నుంచి నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయని, దీంతో ఏపీలో రూపాయి విలువ ఘోరంగా పడిపోయిందని మినిస్ట్రీ ఆఫ్ స్టాటస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ MOSPI తాజా గణాంకాలు వెల్లడించింది. అంతేకాదు, దేశంలో మిగతా రాష్ట్రాలకంటే ఏపీలోనే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందని షాకింగ్ నివేదిక వెల్లడించింది.
ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ నిత్యావసరాల ధరలు తగ్గించమంటున్నారని, కానీ, ధరలు తగ్గించకపోవడం వెనుక జగనన్న ముందుచూపు ఎంతో ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఒకవేళ నిత్యావసరాల ధరలు తగ్గిస్తే జనాలు ఇష్టం వచ్చినట్టు కూర్చుని సుష్టుగా తిని అనవసరమైన కొవ్వు పెంచుకుంటారని, అందుకే ధరలు తగ్గించడం లేదని పంచ్ లు పేలుతున్నాయి. జగన్ అన్న జనం కోసం చేస్తున్న పనిని కూడా ప్రత్యర్థులు రాజకీయం చేస్తున్నారని, దయచేసి ప్రజలు దీనిని గమనించగలరంటూ జగన్ పై మీమ్స్ తో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఇక, ప్రపంచం మొత్తం కరోనా విలయ తాండవం చేస్తున్నప్పటికీ, భారత్ సహా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నప్పటికీ, ఏపీలోని జగన్ సర్కార్ మాత్రం సంక్షేమ పథకాలను నిరాటంకంగా అమలు చేస్తోందంటూ వైసీపీ నేతలు గొప్పలు పోతోన్నసంగతి తెలిసిందే. అయితే, జగన్ అప్పు చేసి పప్పు కూడు పెడుతున్నారని స్వయంగా కాగ్ పలు మార్లు సంచలన గణాంకాలు వెల్లడించింది.
ఇక, ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారుల నెలవారీ చెల్లింపుల కోసం ఆపసోపాలు పడుతోన్న జగన్…సంక్షేమ పథకాలకు మాత్రం లోటు రానివ్వడం లేదన్నది వైసీపీ నేతల వాదన. అయితే, ఈ సంక్షేమ పథకాల కోసం జగన్ జనంపై పన్నులు వేసి నడ్డి విరస్తున్నారని, అదీ చాలక నిత్యావసరాల సరుకుల ధరలు పెంచి జనాల ఒళ్లు, ఇల్లు గుల్ల చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నిత్యావసరాల ధరలు పెంచి జనం జేబులకు జగన్ పెద్ద పెద్ద చిల్లులు పెడుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. జనం ఆరోగ్యంపై జగనన్న ధ్యాస…మీకర్థమవుతోందా? అంటూ రష్మిక మందన డైలాగ్ తో ట్రోలింగ్ జరుగుతోంది.