ఏపీలో గత ఐదేళ్లలో చోటు చేసుకున్న వింతలు, విడ్డూరాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. జగన్ హయాంలో ప్రజాధనాన్ని వైకాపా నాయకులు ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టారో, మరెంతలా దోచుకున్నారో చెప్పడానికి అనేక ఉదాహరణలు బయటకొస్తున్నాయి. గుడివాడలో టిడ్కో గృహాల ప్రారంభోత్సవ సభ అంటూ ఒక ఫేక్ సభ పెట్టి.. జనాలకు నిమ్మకాయ నీళ్లు సరఫరా పేరుతో గడ్డం గ్యాంగ్ 28 లక్షల రూపాయలు నోకేసిన బోగోతం ఇటీవల బట్టబయలు కావడంతో ప్రజలను నివ్వెరపోయారు.
తాజాగా ఇటువంటి మరొక కుంభకోణం తెరపైకి వచ్చింది. 2019 నుంచి 2024 మధ్య తాడేపల్లి ప్యాలెస్ లో కేవలం ఎగ్ పఫ్ ల కోసమే ఏకంగా రూ. 3.60 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టారట. తాడేపల్లి ప్యాలెస్ అంటే జగన్ సొంత నివాసం. అయితే సొంత ఇంటినే గత ఐదేళ్లు సీఎం క్యాంపు కార్యాలయంగా జగన్ వాడుకున్నారు. వందలాది మంది అధికారులు, సిబ్బంది పని చేసేవారు. వారికి స్నాక్స్ ఖర్చు గట్టిగానే ఉంటుంది.
కానీ మరీ ఎగ్ పఫ్ ల కోసమే ఏకంగా రూ. 3.60 కోట్లు ఖర్చైందని లెక్కలు రాయడంతో.. ప్రజలు, రాజకీయ ప్రత్యర్థులు జగన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. రూ. 3.60 కోట్లు అంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఎగ్ పఫ్ ల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.71 లక్షలు తగలేసింది. ఈ లెక్కన రోజుకు రూ. 20 వేల ఖర్చుతో 993 ఎగ్ పఫ్లు వినియోగించారు. ఐదేళ్లలో మొత్తం 18 లక్షల ఎగ్ పఫ్లు మింగేశారు. ఈ షాకింగ్ లెక్కలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఎగ్ పఫ్ ల పేరుతో తాడేపల్లి ప్యాలెస్ భారీ స్కామ్ జరిగిందని మండిపడుతున్నారు. ప్రజాధనమంటే అంత చులకనా జగన్..? అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇక అధికార టీడీపీ సైతం ఈ విషయంపై స్పందించింది. `తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ఏడాదికి రూ. 72,51,340 ఎగ్ పఫ్ లను తిన్నాడంటే… మిగతా కాఫీలు, టిఫినీల ఖర్చు ఎంతై ఉంటుంది ఊహించండి.` అంటూ సోషల్ మీడియా ద్వారా మాజీ సీఎంను ఏకేసింది.