రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. శాశ్వత శత్రుత్వం.. శాశ్వత మిత్రుత్వం అంటూ ఏమీ ఉండదు. ఏ క్షణంలోనైనా తమ ప్రయోజనాలకు అనుగుణంగా శత్రువులు మిత్రులుగా మిత్రులు శత్రువులుగా మారిపోతారు. ఈ రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. గత సమావేశాలకు టీఆర్ఎస్ మంత్రిగా హాజరైన ఈటల రాజేందర్.. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టారు. ఒకప్పుడు తన తోటి టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసి వచ్చిన ఆయన.. ఇప్పుడు వాళ్లకు ప్రత్యర్థిగా బీజేపీ నేతలతో కలిసి సాగుతున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఈటల.. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టారు. గతంలో ప్రభుత్వ ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి పనులను వివరించిన ఆయన.. ఇప్పుడు అవే ప్రభుత్వ విధానాలపై విమర్శలు కురిపించేందుకు సిద్ధమయ్యారు. ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈటల.. ఇప్పుడు అదే బడ్జెట్‌పై ప్రశ్నలు గుప్పించేందుకు సై అంటున్నారు. ఎంతలో ఇంత మార్పు అంటూ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉండి.. ఉద్యమ నేతగా ఎదిగిన ఆయన ఇప్పుడు మొదటిసారి ఆ పార్టీకి వ్యతిరేకంగా సభలో గళం వినిపించనున్నారు.
భూ కబ్జా ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల.. బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం అందుకున్నారు. తనను ఓడించేందుకు కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని దాటి గెలిచిన ఈటల గట్టి షాక్‌నిచ్చారు. ఆ ఎన్నికలో ఓటమితోనే బీజేపీను కేసీఆర్ టార్గెట్ చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని ఇతర పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నారు.