కేంద్రంలోని బిజెపిపై తెలంగాణ సీఎం టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ సమర శంఖం పూరించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా బిజెపితో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్ ఇటీవల ప్రధాని మోడీ పర్యటనకు కూడా దూరంగా ఉండటం సంచలనం రేపింది. ఆ తర్వాత టిఆర్ఎస్ నేతలతో జరిగిన విస్త్రృత స్థాయి సమావేశంలో ఈడి, సిబిఐ, ఐటి దాడుల గురించి కేసీఆర్ ప్రస్తావించారు. కేంద్రం ఆ దాడుల ద్వారా టిఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తుందని, ఎవరు భయపడవద్దని కేసీఆర్ టిఆర్ఎస్ నేతలకు దిశా నిర్దేశం చేశారు.ఆయన ఆ మాట అన్న 24 గంటల్లోపే తాజాగా తెలంగాణలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఈడి అధికారులు షాక్ ఇచ్చారు.
కొంతకాలంగా పలువురు టీఆర్ఎస్ నేతల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్న ఈడీ అధికారులు తాజాగా మంత్రి తలసాని సోదరులను టార్గెట్ చేశారు. తలసాని మహేష్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లను ఈడీ విచారణ జరుపుతున్న వైనం సంచలనం రేపింది.
మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో, క్యాసినో హవాలా కేసుల్లో ఆరోపణలపై వారిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. గత నాలుగేళ్లలో వారు జరిపిన ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీీ అధికారులు ఆరా తీస్తున్నారట. అయితే, ఈ విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. మరోవైపు, మాజీ టిడిపి నేత, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు కూడా ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. క్యాసినో కేసులో ఎల్ రమణకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు, గురు, శుక్రవారాల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.